వర్మను జనసైన్యం రెచ్చగొడుతోందా ?

పవన్ ని ఎన్నికల్లో గెలిపించి తాను పిఠాపురానికి అనధికార ఎమ్మెల్యేగా ఉండవచ్చు అని భావించారో ఏమో కానీ వర్మ 2024 ఎన్నికల్లో జనసేనాని విజయాన్ని తన వ్యక్తిగత విజయంగా భావించి భుజాలకు ఎత్తుకున్నారు.;

Update: 2025-03-14 11:07 GMT

పిఠాపురం వర్మ అంటే ఆయనే. అంతకు ముందు ఆయన టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ గా అంతా వ్యవహరించేవారు. కానీ ఎప్పుడైతే పవన్ పిఠాపురంలో పోటీకి దిగాలనుకున్నారో ఆ మీదట పిఠాపురంలో వర్మ అనుచరులు రచ్చ చేశారో ఇక అక్కడ నుంచి ఆయన పేరు పిఠాపురం వర్మగా మారుమోగుతోంది.

పవన్ ని ఎన్నికల్లో గెలిపించి తాను పిఠాపురానికి అనధికార ఎమ్మెల్యేగా ఉండవచ్చు అని భావించారో ఏమో కానీ వర్మ 2024 ఎన్నికల్లో జనసేనాని విజయాన్ని తన వ్యక్తిగత విజయంగా భావించి భుజాలకు ఎత్తుకున్నారు. పవన్ ఇమేజ్, కూటమి బలం, వర్మ పలుకుబడి అన్నీ కలసి ఏకంగా డెబ్బై వేల మెజారిటీ పవన్ కి దక్కింది. ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. పిఠాపురం చరిత్రను పవన్ అలా తిరగరాశారు.

మరి దానిని తన వరకూ కారణం అయిన వర్మకు దక్కిందేంటి అంటే శూన్య హస్తమే అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే తొలి విడతలోనే ప్రాధాన్యతను ఇచ్చ్చి ఎమ్మెల్సీ పదవి కట్టబెడతామని పెద్దలు హామీ ఇచ్చారు. దానిని వర్మ కూడా నమ్మారు.

తీరా ఏడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయినా అందులో జనసేనకు రెండు బీజేపీకి ఒకటి వెళ్ళాయి కానీ వర్మకు మాత్రం ఒక్క సీటూ ఇవ్వలేదు. దాంతో వర్మ చాలా బాధలో ఉన్నారు. పదవి లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పడం రాజకీయంగా పడికట్టు పదంగా ఉండొచ్చేమో కానీ నిజంగా చూస్తే కనుక ఎమ్మెల్సీ పదవి దక్కక పోవడం వర్మకు నిద్రలేని రాత్రులనే తెప్పిస్తోందని అంటున్నారు.

ఈ నేపథ్యం నుంచి చూసినపుడు అసలే బాధలో ఉన్న వర్మకు మరింత రెచ్చగొట్టేలా జనసైనికులు చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీగా నెగ్గిన నాగబాబుకు ఘన స్వాగతం, ఆయనకు ఘన సన్మానం అంటూ పిఠాపురం నిండా వెలసిన ఫ్లెక్సీలు జనసైనికుల ఉత్సాహాంగా ఉన్నా వర్మ అండ్ కోకు మాత్రం అవి పుండు మీద కారం చల్ల్లినట్లుగానే ఉన్నాయని అంటున్నారు.

వర్మకు హామీ మేరకు ఎమ్మెల్సీ దక్కలేదు, పొత్తులో భాగంగా ఎమ్మెల్యే కావాల్సిన చాన్స్ పోయింది. అలా పవన్ ఎమ్మెల్యేగా నెగ్గి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నాగబాబు ఎమ్మెల్సీ అయి రేపో మాపో మంత్రి కాబోతున్నారు. ఈ నేపధ్యంలో పిఠాపురం అంతా జనసేన హవా కనిపిస్తోంది. జనసేన అడ్డా పిఠాపురం అని నాదెండ్ల మనోహర్ ప్రకటించేశాక వర్మకు రాజకీయ భవిష్యత్తు దర్శనం ఈపాటికి కలిగే ఉండాలని అంటున్నారు.

అయినా వేచి చూసే ధోరణిలో ఉన్న వర్మ అండ్ కోకు ఇపుడు జనసైనికులు అతి ఉత్సాహం పొలిటికల్ ర్యాంగింగ్ నే తలపిస్తోంది అని అంటున్నారు. దీంతో తట్టుకోలేకపోతోందట వర్మ అనుచర వర్గం. తనకు పదవి రాలేదు అన్న బాధ కంటే జనసైన్యం చేసే ర్యాగింగే ఎక్కువగా బాధపెడుతోందిట.

ఇంకో వైపు చూస్తే పిఠాపురంలో టీడీపీ హవా ఎక్కడా కనిపించడం లేదు. వారికి పనులు సాగడంలేదు. ఎటు చూసినా జనసేనదే పెత్తనం అయిపోయింది. దాంతో వర్మ అనుచరులు అభిమానులు ఇదేమి రాజకీయమో అని కలవరం చెందుతున్నారుట. చూడాలి మరి ముందు ముందు వర్మ మెరెన్ని ఈ తరహా ర్యాగింగులు భరించాల్సి ఉందో.

Tags:    

Similar News