లెఫ్ట్ టూ రైట్ : దటీజ్ పవన్ చరిష్మా

పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫిలాసఫీ ఏమిటి అన్న ప్రశ్న ఎవరైనా వేసుకుంటే జవాబు వారికి అంత సులువుగా దొరకదు.;

Update: 2025-03-14 10:30 GMT

పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫిలాసఫీ ఏమిటి అన్న ప్రశ్న ఎవరైనా వేసుకుంటే జవాబు వారికి అంత సులువుగా దొరకదు. ఎందుకంటే ఆయన చెగువేరా నుంచి సనాతన ధర్మం దాకా తన రాజకీయ ప్రస్థానంలో సాగుతూ వచ్చారు. ఆయన లెఫ్టిస్ట్ ఫిల్సాసఫీ టచ్ ఉన్న వారుగా 2014 మార్చి 14న ఏర్పాటు చేసిన జనసేన సభలోని ప్రసంగం చూస్తే కనిపిస్తుంది. కానీ 2024 ఎన్నికల తరువాత ఆయన పూర్తిగా సనాతన వాదిగా మారిపోయారు.

అయితే ఇవేమీ ఆయన నాయకత్వంలోని జనసేనను ఇబ్బంది పెట్టలేదు. ఆ పార్టీ అంతా పవన్ చరిష్మాతోనే ముందుకు సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. జనసేనకు 2025 మార్చి 14తో అచ్చంగా 11 ఏళ్ళు నిండిపోయిన నేపధ్యంలో జనసేన ఈ రాజకీయ ప్రస్థానంలో పడిన అడుగులు పవన్ చేసిన రాజకీయాల గురించి చూస్తే ఆసక్తిగానే ఉంటుంది.

కాంగ్రెస్ అరాచకాలను ఎదిరించేందుకు పార్టీ అంటూ 2014లో నినదించిన పవన్ దానికి కట్టుబడి 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ బీజేపీలకు మద్దతు ప్రకటించారు. తొలి ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు కూడా. అయితే ఈ రెండు పార్టీలను ఆయన మూడేళ్ళ తరువాత విభేదించడం మొదలెట్టారు. ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వలేదని బీజేపీని నిందించారు. అలాగే ఏపీలో అభివృద్ధి పాలన లేదని టీడీపీని నేరుగా టార్గెట్ చేసారు.

అలా తాను విపక్ష పాత్రలోకి మారి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ వామపక్షాలతో కలసి ఎన్నికల్లో పోటీకి దిగారు. మొత్తం 134 సీట్లలో ఈ మూడు పార్టీలూ పోటీ చేస్తే గెలిచింది ఒకే ఒక్క సీటు. అది రాజోలులో రాపాక ప్రసాదరావు గెలిచారు. పవన్ పోటీకి దిగిన భీమవరం గాజువాకలలో ఓటమిని చవి చూశారు.

దాంతో జనసేన పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు తొలి పరాజయం కోలుకోలేని దెబ్బ గానే ఉంటుంది. కానీ పవన్ పడి లేచిన కడలి తరంగం మాదిరిగా వైసీపీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవడం మొదలెట్టారు. ఇసుక ఉద్యమాన్ని ఆయన చేపట్టి భవన నిర్మాణ కార్మికులు ఇసుక కోరత కారణంగా ఉపాధి పొందడం లేదని విమర్శిస్తూ విశాఖలో లాంగ్ మార్చ్ ని నిర్వహించారు. దానికి టీడీపీ నుంచి మద్దతు కూడా లభించింది. ఇది జరిగిన తర్వాత బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. అలా బీజేపీతో కలసి పవన్ సాగించిన రాజకీయ పోరాటంలో ఆయనకు జాతీయ పార్టీ అండ ఉందన్న భావన అయితే కలిగింది.

కానీ పవన్ జనసేన బీజేపీతో ఏపీలో ఎంతవరకూ ప్రభావం చూపిస్తుంది అన్న చర్చ కూడా సాగింది. అదే సమయంలో తెలుగుదేశం పట్ల సాఫ్ట్ కార్నర్ తో పవన్ ఉండడంతో వైసీపీ మూడు పార్టీలూ ఒక్కటే అని ముందే కూటమిని కలిపేస్తూ విమర్శలు చేసింది. ఇది జనసేనకే ఎక్కువ మేలు చేసింది. జనసేనాని కూడా తన మనసులోని ఉన్న దానిని ఎక్కడా దాచుకోలేదు. ఆయన 2022 జనసేన ఆవిర్భావ సభలో ఏపీలోని అన్ని పార్టీలు వైసీపీకి వ్యతిరేకంగా కలవాలని పిలుపు ఇవ్వడం వెనక ఉన్న ఉద్దేశ్యమూ అదే అని అంటారు.

ఇక 2023లో జనసేనకు ఒక పొలిటికల్ టర్నింగ్ పాయింట్ గా బాబు అరెస్ట్ మారింది. బాబుని అరెస్ట్ చేసిన క్రమంలో రాజమండ్రి జైలుకు వెళ్ళి ములాఖత్ అయిన పవన్ జైలు బయటే టీడీపీతో పొత్తు ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. అప్పటికి బీజేపీతో పవన్ పొత్తులో ఉన్నారు. అయినా ఆ పార్టీని ఒప్పిస్తాను అని చెప్పారు.

అలా అనుకున్నట్లుగానే బీజేపీని కూడా ఈ వైపుగా తెచ్చి మూడు పార్టీలతో బలమైన కూటమిని కట్టి 2024 ఎన్నికల్లో ఏపీలో 164 సీట్లు కూటమిని దక్కేలా చూడడంలో పవన్ పాత్ర కీలకంగానే ఉంది అన్నది వాస్తవం. ఇక వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేయడం ద్వారా జనసేన తన పంతం నెరవేర్చుకుంది

పవన్ పిఠాపురం అసెంబ్లీ సీటుని ఎంచుకుని గెలిచి వచ్చారు. ఏకంగా 70 వేల పై చిలుకు మెజారిటీ ఆయనకు లభించింది. ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కేవలం పవన్ మాత్రమే కాదు ఆ పార్టీ పొత్తులలో తీసుకున్న 21 అసెంబ్లీ రెండు ఎంపీలను కూడా గెలిచింది. అందుకే పిఠాపురంలో సభకు జయకేతనం పెట్టామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఈ నేపధ్యంలో పిఠాపురం సభ ద్వారా పవన్ కూటమిని మరింత బలోపేతం చేసే ప్రణాళికలను అలాగే ఏపీలో అభివృద్ధికి సంబంధించిన కార్యాచరణను చెబుతారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారు అన్నది కూడా వివరిస్తారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయ పార్టీలు సాధారణంగా సిద్ధాంత భూమిక పునాదిగా సాగుతాయి.

కానీ పవన్ ఇమేజ్ మాత్రం వాటిని అన్నింటినీ అధిగమించి ముందుకు సాగే చోదక శక్తిగా మారింది. ఆయన వామపక్ష భావజాలం వినిపించినా లేక హిందూత్వ రాగం ఆలపించినా కూడా సై అనేలా రాజకీయం సాగుతోంది అంటే దటీజ్ పవన్ చరిష్మా అని చెప్పకతప్పదు. అరుదైన ఈ ఇమేజ్ పవన్ లాంటి వారికే ఉంటుంది అనడంలో సందేహం అయితే లేదు.

Tags:    

Similar News