ఎన్టీఆర్ కి వెన్నుపోటు...అంతా గ్రహాల ప్రభావమే !
ఆయన ఒక యూ ట్యూబ్ చానల్ కి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.;
ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చేశారు. ప్రపంచ చరిత్ర అన్న పుస్తకాన్ని ఆయన రచించారు. ఆ పుస్తకావిష్కరణకు తోడల్లుడు ముఖ్యమంత్రి చంద్రబాబుని ముఖ్య అతిధిగా పిలిచారు. అలా మూడు దశాబ్దాల తరువాత ఇద్దరూ విభేదాలు మరచి ఒక్కటిగా జనాలకు కనిపించారు.
ఇక అప్పటి నుంచి దగ్గుబాటి సోషల్ మీడియాలో యూ ట్యూబ్ చానళ్ళలో కనిపిస్తున్నారు. ఆయన ఒక యూ ట్యూబ్ చానల్ కి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 1995 లో ఎంటీఆర్ కి వెన్నుపోటు జరిగింది అన్న దాని గురించి చెబుతూ అంతా గ్రహాల ప్రభావమే అని చెప్పుకొచ్చారు.
ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఇవన్నీ తలచుకుంటే అంత పెద్ద బిగ్ ఫిగర్ ని అధికారంలో నుంచి దించేయడానికి తమ వల్ల అవుతుందా అని అన్నారు. అయితే గ్రహాల ప్రతికూలత వల్లనే అలా జరిగిందని అన్నారు. 1995 ఆగస్టు నెలలో ఎన్టీఆర్ కి పదవీగండం ఉందని ఒక జ్యోతీష్కుడు అప్పట్లో ముందే చెప్పారని దగ్గుబాటి గుర్తు చేశారు.
ఆ విషయాన్ని ఆ పుస్తకాన్ని కూడా తాను ఎన్టీఆర్ కి అందచేశాను అని అన్నారు. అదే సమయంలో సహకార సంఘ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి వ్యతిరేకగా కరీం నగర్ లో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు చేశారని ఎన్టీఆర్ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు.
అలా ఆగస్టు సంక్షోభం మొదలైంది అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ నాడు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే వేరేగా ఉండేదని అన్నారు. అంతా గ్రహాల ప్రభావం అని చెప్పారు. ఇక ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశం కూడా గ్రహాల ప్రభావమే అని ఆయన చెప్పడం విశేషం.
తాను ఇపుడు ఏమైనా అంటే ఆయా వ్యక్తులకు కోపం వస్తుందని ఆయన అంటూ అప్పట్లో ఏమి జరిగింది అన్న దానిని తాము పూసగుచ్చినట్లు ఒక చరిత్ర కొన్ని నిజాలు అని రాశానని అంతకు మించి తాను మాట్లాడేది లేదని అన్నారు
టీడీపీలో తన రాజకీయ ప్రవేశం అనూహ్యంగా జరిగిందని దగ్గుబాటి అన్నారు. తన మామ ఎన్టీఆర్ కి రాజకీయంగా సాయం కోసం మాత్రమే తాను ఆయన వెంట ఉన్నానని చెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాక తన డాక్టర్ వృత్తిలోకి తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నానని చెప్పారు. అయితే అది కుదరలేదని తాను తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వచ్చిందని అలా మంత్రిగా ఎంపీగా ఇతర పదవులు అన్నీ చాలా చిన్న వయసులోనే తాను అనుభవించాను అని దగ్గుబాటి చెప్పారు.
టీడీపీలో పునాది నుంచి తాను ఉన్నానని తనకు ఎక్కువ మంది నాయకుల మద్దతు ఉండేదని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రోజుకీ తాను రాజకీయాల్లోకి తెచ్చిన వారు ఎంతో మంది ఉన్నారని వారు ఇపుడు వివిధ పార్టీలలో ఉన్నా తన పట్ల అదే అభిమానం చూపిస్తారు అని దగ్గుబాటి చెప్పారు.
తాను తెలుగుదేశం పార్టీని వీడేటపుడు ఎంతో ఏడ్చానో ఎవరికీ తెలియదని అన్నారు. తాను ఎపుడూ అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళలేదని, తాను వెళ్లాక మాత్రమే ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చాయని ఆయన చెప్పారు. తాను బీజేపీలో చేరాక ఏపీలో బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుందని అన్నారు.
ఇక 2004లో కాంగ్రెస్ లో చేరితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని, 2019లో వైసీపీలో తాను చేరితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. తాను మాత్రం అధికారానికి పదవులకు దూరంగానే ఉన్నాను అని ఆయన చెప్పారు.
బాబుతో విభేదాలు ఉన్నాయి కానీ జీవితం అన్నింటికంటే చాలా ముఖ్యమని అన్నారు. ఉన్న ఒక్క మానవ జన్మలో హాయిగా ఉండగా అసూయ ద్వేషాలు ఎందుకు అని భావించే మూడు దశాబ్దాల తరువాత బాబుతో కలసిపోయాను అన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం పట్ల బాధపడటం లేదని అన్నారు. తన జీవితం ఇపుడు ఇంకా ఆనందంగా ఉందని దగ్గుబాటి అన్నారు.