పవన్ కల్యాణ్ హెలికాప్టర్ ప్రయాణాలపై వైసీపీ ఘాటు పోస్టు!
కారణాలు ఏవైనప్పటికీ అధికారంలోకి వచ్చిన అనంతరం నేతలు వీలైనంత వరకూ గాల్లో ప్రయాణాలు చేయడానికే ఆసక్తి కనబరుస్తుంటారని అంటారు.;
కారణాలు ఏవైనప్పటికీ అధికారంలోకి వచ్చిన అనంతరం నేతలు వీలైనంత వరకూ గాల్లో ప్రయాణాలు చేయడానికే ఆసక్తి కనబరుస్తుంటారని అంటారు. అధికారం లేనంతకాలం ప్రజాధనం గురించి వ్యాఖ్యానిస్తూ.. కుర్చీ ఎక్కగానే ఖర్చులు మర్చిపోతుంటారని, గతాన్ని గుర్తుకు తెచ్చుకోరని అంటుంటారు. గతంలో జగన్ పై ఇలాంటి విమర్శలు కోకొల్లలుగా వచ్చేవి!
అవును... గతంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్ ప్రతీ చిన్న దూరానికీ హెలీకాప్టర్ ప్రయాణాన్నే ఎంచుకునేవారనే విమర్శలు నాడు బలంగా వినిపించేవి. ఉదాహరణకు... తాడేపల్లి నుంచి తెనాలికి సైతం హెలీకాప్టర్ లోనే జగన్ ప్రయాణిస్తున్నారంటే.. ఆయనకు ప్రజాధనం అంటే ఎంత లెక్కలేనితనమో అంటూ జనసేన నేత నాదేండ్ల మనోహర్ నాడు తీవ్ర విమర్శలు గుప్పించారు!
అప్పట్లో ఈ విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కట్ చేస్తే... జగన్ ను జనం ఇంటికి సాగనంపారు! కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు! ఈ సమయంలో... పవన్ కల్యాణ్ కూడా కొద్ది పాటి దూరానికీ హెలీకాప్టర్ ప్రయాణానికే మొగ్గుచూపుతున్నారనే విషయం ఇప్పుడు తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా... నేడు పిఠాపురం నియోజకవర్గంలోని చింతాడ గ్రామంలో జనసేన ఆవిర్భావ వేడుకకు హాజరయ్యేందుకు మాదాపూర్ లోని ఆయన నివాసం నుంచి మంగళగిరి క్యాంప్ ఆఫీసుకు వచ్చే రూటు మార్గానికి సంబంధించిన వైర్ లెస్ మెసేజ్ షీట్ ను వైసీపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది! ఇందులో పవన్ కల్యాణ్ ప్రయాణ వివరాలు ఉన్నాయి.
ఇందులో... ఈ రోజు ఉదయం 9:30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన పవన్ కల్యాణ్ 10:40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగుతారని.. తిరిగి 10:45 గంటలకు అక్కడ హెలీకాప్టర్ లో బయలుదేరి 10:55 గంటలకు మంగళగిరిలోని క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారని తెలిపింది. ఈ విషయాలపైనే ఇప్పుడు వైసీపీ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది!
ఈ క్రమంలో... సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడానికి డబ్బుల్లేవని బీద ఏడుపు ఏడ్చే పవన్ కల్యాణ్ కు ప్రజల డబ్బంటే లెక్కలేదని.. గన్నవరం నుంచి మంగళగిరికి కూడా లక్షలు ఖర్చు చేసి హెలీకాప్టర్ లో తిరుగుతారని.. ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు మాత్రం ఏనాడూ ఇంత హుటాహుటిన వెళ్లింది లేదని రాసుకొచ్చింది.
కానీ... సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళ్తారని ఎద్దేవా చేసింది! అటు కాశీ నాయన సత్రాలు కూల్చేసినా, ఇటు మహిళల మీద వరుస దాడులు జరుగుతున్నా సేనానికి కనిపించదు, వినిపించదు అని విమర్శించిన వైసీపీ... నిద్రపోతున్నవాళ్లను లేపగలం కానీ.. నిద్ర నటిస్తున్నవాళ్లను ఎవరూ లేపలేరని పోస్ట్ చేసింది.