''నేను పార్ట్‌ టైం పొలిటీషియన్‌.. ఫుల్‌ టైం బిజినెస్ మేన్‌ను''!

ఈ క్రమంలో పార్టీకి చెందిన అందరు నేతల ముందు తాను పార్టీ మారేందుకు సిద్ధమైన అంశాన్ని ఓపెన్ గా చెప్పేసినట్లుగా తెలుస్తోంది

Update: 2024-03-19 04:43 GMT

సంచలన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల కాలంలో ఆయన పార్టీ మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఆదివారం ఆయన నివాసానికి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు వెళ్లటం.. వారంతా కలిసి పెద్ద ఎత్తున చర్చలు జరపటం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీకి చెందిన అందరు నేతల ముందు తాను పార్టీ మారేందుకు సిద్ధమైన అంశాన్ని ఓపెన్ గా చెప్పేసినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

తాను పార్ట్ టైం పొలిటీషియన్ ను అని.. ఫుల్ టైం బిజినెస్ మేన్ గా అభివర్ణించిన ఆయన.. తాను పార్టీ మారటం పక్కా అని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. తాను రెండు పార్టీల్లో ప్రయత్నిస్తున్నానని.. ఎందులో వర్కువుట్ అయితే అందులో వెళ్లిపోతానన్న మాట ఆయన నోటి నుంచి రావటంపై గులాబీ నేతలు అవాక్కు అవుతున్నారు. నిజానికి ఈ పరిణామం ఎలా చోటు చేసుకుందున్న విషయంలోకి వెళితే కాస్త వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది.

సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానానికి జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కొడుకు భద్రారెడ్డిని రంగంలోకి దించిన మల్లారెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందించారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన కాలేజీల విషయంలోనూ.. తన విద్యా సంస్థలకు సంబంధించిన అంశాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా పేర్కొంటూ అధికారులు చర్యలు తీసుకోవటం తెలిసిందే. ఈ క్రమంలో తన చేతిలో అధికారం లేకుంటే ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని గుర్తించిన ఆయన.. బీఆర్ఎస్ తరఫున ఎంపీ ఎన్నికల్లో పోటీ పడితే మరిన్ని ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో తాము బీఆర్ఎస్ నుంచి పోటీ చేయలేమని సున్నితంగా చెప్పేశారు.

ఓవైపు పోటీకి దూరం అంటూనే మరోవైపు కాంగ్రెస్ లో చేరి.. మల్కాజిగిరి అభ్యర్థిగా తన కొడుకును దించాలన్న నిర్ణయాన్ని తీసుకున్న మల్లారెడ్డి.. అందుకు తగ్గట్లు పావులు కదిపారు. ఇందులో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. ఈ విషయాలన్ని బయటకు రావటంతో ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాను పార్టీ మారటం లేదని.. అయితే తన కొడుకు పోటీ విషయంలో అతనిదే నిర్ణయమని పేర్కొన్నారు. ఈ క్రమంలో మల్లారెడ్డికి ముందరకాళ్ల బంధం వేసేందుకు వీలుగా బీఆర్ఎస్ పెద్దలు రంగంలోకి దిగారు.

మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న రాగిడి లక్ష్మారెడ్డిని తీసుకొని మల్లారెడ్డి ఇంటికి ఆదివారం ఉదయం వెళ్లాలని.. ఆయన గెలుపు కోసం పని చేయాలని.. పార్టీకి విజయాన్ని అందించటంలో కీలకభూమిక పోషించాలన్న విషయాన్ని ఆయనకు చెప్పి ఒప్పించేందుకు వీలుగా ప్లాన్ చేశారు. అనుకున్నట్లే పలువురు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు మల్లారెడ్డి ఇంటికి వెళ్లారు. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో మల్లారెడ్డి ఓపెన్ అయినట్లుగా సమాచారం. తాను పార్టీ మారటం ఖాయమని.. తాను పార్ట్ టైం పొలిటిషీయన్.. ఫుల్ టైం బిజినెస్ మ్యాన్ గా పేర్కొన్న వైనం గులాబీ నేతలకు దిమ్మ తిరిగే షాకిచ్చిందంటున్నారు.

తాను పార్టీ మారటం ఖాయమని.. త్వరలోనే ఆ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పిన ఆయన.. తాను కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తే.. కొందరు రాష్ట్ర నేతలు అడ్డుపడిన విషయాన్ని ఆ భేటీలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎపిసోడ్ ను సైతం వివరించేందుకు మొహమాటపడలేదని చెబుతున్నారు. బిజినెస్ మ్యాన్ కావటంతో రాజకీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందన్న ఆయన మాటలు బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు స్రష్టిస్తున్నాయి. పదేళ్లు మంత్రిగా ఉన్నపెద్ద మనిషి.. పార్టీ పరాజయం పాలైన తర్వాత పట్టించుకోకుండా వెళ్లిపోవటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.

కాంగ్రెస్ తన మొదటి ప్రాధాన్యతగా చెప్పిన మల్లారెడ్డి.. బీజేపీలోకి వెళ్లేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పటం ఒక ఎత్తు అయితే.. ఈ భేటీలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే కం మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం తాను పార్టీ మారే ఉద్దేశం లేదన్న విషయాన్ని అందరి ఎదుట చెప్పేయటం కొసమెరుపు. మామ ఏమో పార్టీ మారుడు ఖాయమని తేల్చేస్తే.. అల్లుడు మాత్రం గులాబీ కారును ఎట్టి పరిస్థితుల్లో దిగేది లేదని తేల్చేయటం చూస్తే.. మల్లారెడ్డా మజాకానా? అన్న భావన కలుగక మానదు.

Tags:    

Similar News