అతి చేస్తున్న బంగ్లాదేశ్.. తొలిసారి దీదీ ఫైర్

ఆ దేశ రాజకీయ నాయకులు కొందరు తాము త్వరలోనే పశ్చిమ బెంగాల్ ను ఆక్రమించుకుంటామని నోరు పారేసుకుంటున్నారు. ఈ అతి వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు.

Update: 2024-12-10 05:07 GMT

ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల సంగతి తెలిసిందే. షేక్ హసీనా పదవీచ్యుతి కావటం.. ఆమె భారత్ ను ఆశ్రయం కోరటం తెలిసిందే. అప్పటి నుంచి బంగ్లాదేశ్ లో భారత్ మీద కోపం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అదే సమయంలో బంగ్లాదేశ్ లోని మైనార్టీల మీద దారుణ హింస పెరుగుతోంది. ఆ దేశంలో మైనార్టీలుగా ఉండే హిందువుల మీద.. వారి ఆస్తుల మీదా.. మహిళల మీద జరుగుతున్న దుర్మార్గాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. వీటి మీద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్నా.. అలాంటి దారుణాలకు చెక్ పెట్టేందుకు ఆ దేశం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు కనిపించవు. బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ ఇప్పటికే తన ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే.. ప్రపంచ దేశాలు ఈ వ్యవహారంపై తగిన రీతిలో స్పందించటం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. మైనార్టీలకు ఏమైనా జరిగినంతనే చెలరేగిపోయే పశ్చిమ మీడియా సైతం బంగ్లాదేశ్ లో సాగుతున్న దాడులు.. దారుణాల మీద పెద్దగా స్పందిస్తున్నట్లుగా కనిపించదు. ఇదిలా ఉంటే.. భారత్ మీద ద్వేషాన్ని కక్కుతున్న కొందరు బంగ్లాదేశీయులు.. తాజాగా ఒక షాకింగ్ వ్యాఖ్య చేశారు.

ఆ దేశ రాజకీయ నాయకులు కొందరు తాము త్వరలోనే పశ్చిమ బెంగాల్ ను ఆక్రమించుకుంటామని నోరు పారేసుకుంటున్నారు. ఈ అతి వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు.

పశ్చిమ బెంగాల్ ను ఆక్రమించుకుంటామంటూ చేసే వ్యాఖ్యలు మతి లేనివిగా పేర్కొన్న ఆమె.. "మీరొచ్చి బెంగాల్.. బిహార్.. ఒడిశాలను ఆక్రమించుకుంటూ ఉంటే మేం లాలీపాప్ తింటూ

కూర్చుంటామనుకుంటున్నారా?" అంటూ లాగి పెట్టి కొట్టినట్లుగా రియాక్టు అయ్యారు. మా భూభాగాన్ని మా నుంచి లాక్కునే సత్తా ఎవ్వరికీ లేదన్న దీదీ.. "అలాంటి ఆలోచన కూడా రానివ్వకండి" అంటూ హెచ్చరించారు.

భారత్ లో పరిణామాలను రాజకీయం చేయాలని చూడటం బంగ్లాదేశీయులతో పాటు బెంగాల్ కు.. ప్రజలకు క్షేమకరం కాదన్న ఆమె.. అనవసరమైన వ్యాఖ్యల కారణంగా బంగ్లాదేశ్ లో పరిస్థితులు మరింతగా విషమించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఆమె తీవ్రంగా ఖండించారు. మొత్తంగా చూస్తే.. ఇటీవల కాలంలో అతి వ్యాఖ్యలు చేస్తూ.. భారత్ పట్ల అదే పనిగా ద్వేషాన్ని చిందిస్తున్న బంగ్లాదేశ్ కు సరైన పాఠాన్ని నేర్పాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం బలపడుతోంది. మరి.. మోడీ సర్కారు ఏ తరహా నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News