వైసీపీ నుంచి వలసలు.. కూటమిలో కుంపట్లు

ఎన్నికల ముందు తమను ఇబ్బంది పెట్టిన వారిని కూటమిలోకి ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

Update: 2025-01-01 14:30 GMT

ఎన్నికల ముందు నుంచి ఒక్కటిగా కలిసి నడుస్తున్న మూడు కూటమి పార్టీల నడుమ వైసీపీ వలస నేతలు కుంపట్లు రాజేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ, జనసేన పార్టీల్లో చేరికలను టీడీపీ నేతలు బాహటంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల ముందు తమను ఇబ్బంది పెట్టిన వారిని కూటమిలోకి ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అయితే వైసీపీ నుంచి వలసలను వద్దని టీడీపీ నేతలు ఎంత గొంతు చీల్చుకున్న మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ మాత్రం వలస నేతలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడమే చర్చనీయాంశమవుతోంది.

ఏపీలో రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి కట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఇన్నాళ్లు మంచి సమన్వయమే కనిపించింది. అయితే ఇప్పుడు జనసేన, బీజేపీల్లో నేతల చేరికలు కూటమిలో విభేదాలకు కారణమవుతున్నట్లు చెబుతున్నారు. పాలనలో సమన్వయం చూపుతున్న అధికార పార్టీ నేతలు తమ స్వీయ రాజకీయ అకాంక్షలతో ఎవరికి వారే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో మూడు పార్టీల్లో ఎవరు చేరినా ముందుగా చర్చించి సమన్వయం కుదిరాకే నిర్ణయం జరగాలనే ఒప్పందానికి తూట్లు పొడిచినట్లు కనిపిస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు దీనికి ఉదాహరణగా చెబుతున్నారు.

ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ కుదరకపోతే జనసేన, బీజేపీల్లో చేరేలా పావులు కదుపుతున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఈ చేరికనలు ప్రోత్సహించరాదని కూటమి పార్టీలు నిర్ణయించాయి. ఎవరైనా వస్తామంటే వారి గత చరిత్రపై మూడు పార్టీలు చర్చించి ఏకాభిప్రాయం కుదిరితేనే ఆయా పార్టీలు చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించాయి. అయితే వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.క్రిష్ణయ్య ఆ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి టీడీపీ, బీజేపీలో చేరిన తర్వాత పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. మోపిదేవి, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరడాన్ని బీజేపీ కానీ, జనసేన కాని వ్యతిరేకించలేదు. కానీ, వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కిలారు రోశయ్య, బీజేపీలో చేరిన విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ విషయంలో టీడీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అదేవిధంగా తాజాగా జనసేనలో చేరిన గంజి చిరంజీవి, జయమంగళం వెంకటరమణ విషయంలోనూ టీడీపీ వ్యతిరేకిస్తోంది.

వైసీపీ నుంచి వలస వచ్చిన వారిలో బాలినేనితో ఒంగోలు టీడీపీ నేతలు ఇప్పటికీ దూరం పాటిస్తున్నారు. అక్కడి ఎమ్మెల్యే, టీడీపీ నేత దామచర్ల జనార్దన్, బాలినేని రాజకీయంగా ప్రత్యర్థులు. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. దీంతో ఇప్పటికీ బాలనేనిని కలుపుకుని వెళ్లలేకపోతున్నారు. అదేవిధంగా తాజాగా బీజేపీలో చేరిన విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ విషయంలోనూ టీడీపీ నేతలు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. ఆనంద్ కుమార్ వైసీపీలో ఉండగా, అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని అటువంటివారిని ఏలా చేర్చుకుంటారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిలదీస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ పెద్దలకు తమ నిరసన తెలపాలని సీఎం చంద్రబాబును కోరారు అయ్యన్న. అదేవిధంగా పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యతో సిట్టింగ్ ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్రకుమార్ చాలా గ్యాప్ మెంటైన్ చేస్తున్నారు. తన కుటుంబ సభ్యుల పట్ల సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగుల వెనుక రోశయ్య ఉన్నారనేది ఎమ్మెల్యే ధూళిపాల్ల ఆరోపణ. దీనిపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఇక్కడ ఇరువురు నేతలు కలవడం లేదు.

ఇక తాజాగా జనసేనలో చేరిన గంజి చిరంజీవి ముందు టీడీపీలో ఉండేవారు. ఎన్నికల ముందు యువనేత లోకేశ్ పై పోటీ కోసమని ఆయనను వైసీపీ చేర్చుకుంది. టికెట్ ఇవ్వకపోయినా, ఎన్నికల సమయంలో వైసీపీలో కొనసాగిన చిరంజీవి ఇప్పుడు అక్కడ లైఫ్ లేదని జనసేనలో చేరారు. అదేవిధంగా ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ సైతం టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఇప్పుడు అధికారం పోవడంతో మళ్లీ కూటమి పార్టీలో చేరారు. వీరు అధికారం కోసం కూటమిలో చేరుతున్నారని, ఎన్నికల్లో వీరికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి ఏం సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే జనసేన, బీజేపీ మాత్రం తమ పార్టీలను బలోపేతం చేయడానికి చేరికలు ప్రోత్సహించక తప్పడం లేదని చెబుతున్నారు. దీంతో పరిస్థితి ఇలానే కొనసాగితే కూటమి గోడకు బీటలు వచ్చే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News