కారెక్కినా..చెయ్యందుకున్నా..'పతంగి' ఎగరాల్సిందే!

ఎందుకంటే పార్టీలకు పవర్ కావాలి అంతే.. మనం ఎవరికీ 'హై' ఇచ్చాం..ఎవరికీ 'హ్యాండ్' ఇచ్చామన్నది అంత ముఖ్యం కాదు.

Update: 2025-02-22 09:36 GMT

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది పాత చింతకాయ సామెతే. ఈ సామెతను విని విని ఉన్నా..రాజకీయ పార్టీలు కూడా అదే పనిచేస్తుంటాయి. ఎందుకంటే పార్టీలకు పవర్ కావాలి అంతే.. మనం ఎవరికీ ‘హై’ ఇచ్చాం..ఎవరికీ ‘హ్యాండ్’ ఇచ్చామన్నది అంత ముఖ్యం కాదు. రాజకీయాలు చేయాలి..మన పనులు చేసుకోవాలి..ఇంత వెనకేసుకోవాలి..పవర్ లోకి రావాలి..పవర్ లో లేకున్నా పవర్ ఉన్నోడిని మన చేతిలో ఉంచుకోవాలి..ఇప్పుడంతా ఇదే స్ట్రాటజీ.

తెలంగాణలో ఎంఐఎం పార్టీ ఫార్ములా అదే. అధికారంలో ఉన్న పార్టీతో దోస్తీ చేయడం..వారిని తమ గ్రిప్ లో ఉంచుకోవడం..పాతబస్తీలో తమ ఆధిపత్యాన్ని చెలాయించడం..గత కొన్ని దశాబ్దాలుగా ఇదే సాగుతోంది. గతంలో బీఆర్ఎస్ తో జత కట్టిన ఎంఐఎం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతిలో చెయ్యి వేసి దోస్తానా చేస్తోంది. హైదరాబాద్ లో రాజకీయ ఆధిపత్యానికి పార్టీలకు అధికార పార్టీలకు ఎంఐఎంతో కలిసి మెలిసి ఉండడం తప్పనిసరి. అందుకే అధికార పార్టీ ఏదైనా ఎంఐఎంతో ఫ్రెండ్ షిప్ కొనసాగిస్తాయి.

తాజాగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. అందరూ ఊహించినట్టుగానే ఏకగ్రీవమయ్యాయి. అయితే అంతకుముందు నామినేషన్ల సందర్భంగా సస్పెన్స్ లు, అనేక ట్విస్ట్ లతో ఎన్నికల ఎపిసోడ్ నడిచింది. అయినా కాంగ్రెస్, ఎంఐఎం కలయికతో ఆ రెండు పార్టీల కార్పొరేటర్లే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లున్న జీహెచ్ఎంసీలో 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యుల కోసం ఎన్నిక జరిగింది. కాంగ్రెస్, ఎంఐఎం కలిస్తే తమ గెలపు కష్టమేనని భావించినా బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. దీంతో పోలింగ్ జరగకుండానే పోటీలో మిగిలిన 15 స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎన్నికైనట్టు ప్రకటించారు జీహెచ్ఎంసీ కమిషనర్.

వాస్తవానికి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయలేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తో కలిస్తే రాజకీయంగా తమకు ఇబ్బంది కలుగుతుందని భావించి బీజేపీ బరిలోకి దిగలేదు. ఇక బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు బరిలో ఉన్న గెలవడం కష్టమని అధిష్ఠానం సూచించడంతో బరిలో నుంచి తప్పుకున్నారు.

స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి సత్ఫలితాలు పొందినా.. పతంగి పార్టీదే పై చేయి అని చెప్పకతప్పదు. ఎందుకంటే 15 మంది సభ్యులకు గానూ ఎంఐఎం వారే 8 మంది. కాంగ్రెస్ వారు ఏడుగురు. అంటే కాంగ్రెస్ కన్నా ఒక సభ్యుడు ఎక్కువ. హైదరాబాద్ అభివృద్ధి పనుల ఆమోదానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తప్పనిసరి. అంటే ఇక ఏ డెవలప్ మెంట్ ప్రోగ్రాం చేపట్టాలన్నా ఎంఐఎం సభ్యులే కీలకం.

Tags:    

Similar News