మా పార్టీలో కొట్లాట‌లున్నాయి... పొంగులేటి సంచ‌ల‌నం

తెలంగాణ ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన మంత్రిగా పేరొందిన పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి త‌మ పార్టీలోని అంత‌ర్గ‌త రాజ‌కీయాల గురించి అధికారిక కార్య‌క్ర‌మంలోనే వెల్ల‌డించారు.

Update: 2025-01-24 10:40 GMT

అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువ అంట అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడల్లా చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీలో వాస్త‌వానికి అసంతృప్తుల‌, బ‌హిరంగ ఆవేశాలే నిజ‌మ‌నేది రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్పుకొనే మాట‌. మిగ‌తా పార్టీల‌తో పోలిస్తే, కాంగ్రెస్‌లోని ఏ ఇద్ద‌రు నేత‌ల‌కు మ‌ధ్య స‌ఖ్య‌త ఉండ‌దు అని ఆ పార్టీ నేత‌ల గురించి కామెంట్ చేస్తుంటారు. అయితే, కాంగ్రెస్ పార్టీలోని విబేధాల గురించి ఎవ‌రో బ‌య‌టి వారు చెప్ప‌డానికి... సాక్షాత్తు పార్టీలో కీల‌క స్థానంలో, మంత్రి హోదాలో ఉన్న వ్య‌క్తి చెప్ప‌డం ఆస‌క్తిక‌ర‌మైన అంశ‌మే. అలా బ‌హిరంగంగా ప్ర‌క‌టించింది మ‌రెవ‌రో కాదు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి.

తెలంగాణ ప్ర‌భుత్వంలో కీల‌క‌మైన మంత్రిగా పేరొందిన పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి త‌మ పార్టీలోని అంత‌ర్గ‌త రాజ‌కీయాల గురించి అధికారిక కార్య‌క్ర‌మంలోనే వెల్ల‌డించారు. ఈ చిత్ర‌మైన ప‌రిస్థితికి వేదిక‌గా మారింది క‌రీంన‌గ‌ర్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాలు. కేంద్ర పట్టణాభివ్రుద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ క‌రీంన‌గ‌ర్‌లో నేడు ప‌ర్య‌టిస్తూ వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప్రారంభోత్స‌వం, శంకుస్థాప‌న‌లు చేశారు. కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ఇలాకా అయిన క‌రీంన‌గ‌ర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, క‌రీంన‌గ‌ర్ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్‌, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, ఎమ్మెల్యేల స‌మ‌క్షంలోనే పొంగులేటి చేసిన వ్యాఖ్య‌ల గురించి బండి సంజ‌య్ వెల్ల‌డించారు.

కరీంనగర్ లోని హౌజింగ్ బోర్డులో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసిన అనంతరం కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ కట్టర్, బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ బహిరంగ సభ వేదిక దగ్గరకు చేరుకున్నారు. ఈ వేదికపై నుంచే కేంద్ర మంత్రి బండి సంజయ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. `మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఎలాంటి విబేధాలు లేవు. మేం అంతా ఒక్కటే. కరీంనగర్ అభివృద్ధికి ఇద్దరం కలిసి పని చేస్తాం. జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి.. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పని చేస్తాం.

మేమంతా ఇంత మంచిగా కలిసి ఉండటం చూసి మంత్రి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి కూడా ఆశ్చర్యపోతున్నారు. మా ఖమ్మంలో ఎప్పుడూ కొట్లాటలే.. ఇలా ఎప్పుడు ఉంటుందా?! అని పొంగులేటి అనుకుంటున్నారు` అంటూ. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు వేదికపై, సభలో నవ్వులు పూయించడ‌మే కాకుండా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర‌లేపాయి.

సాక్షాత్తు ఇద్ద‌రు కేంద్ర మంత్రుల ముందు, మ‌రో స‌హ‌చ‌ర మంత్రి, ఇంకో మాజీ మంత్రి అయిన‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముందు త‌మ పార్టీలోని పంచాయ‌తీల గురించి మంత్రి పొంగులేటి ఏక‌రువు పెట్టడం బండి సంజయ్ బహిరంగ వేదికపై నుంచే ఈ సంచలన వ్యాఖ్యలు చేయటం ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ల‌కు వేదిక అయిన ఖ‌మ్మం జిల్లాలో అక్క‌డ‌ని నాయ‌కుల మధ్య గ్యాప్ ఉందని పొంగులేటి ఇత‌ర పార్టీల నేత‌ల‌కు చెప్ప‌డం చూస్తుంటే కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌తంగా పెద్ద‌ పంచాయ‌తే న‌డుస్తుంద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News