అదృశ్యమైన భారతీయ విద్యార్థి... యూనివర్శిటీ క్యాంపస్ లో శవమై...!
అవును... అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్శిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి మృతిచెందాడు.
అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల మృతులకు సంబంధించిన వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. కారణం ఏదైనా.. కారకులు ఎవరైనా.. అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత చదువులు చదవాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులు ఇటీవల కాలంలో వరుసగా మృత్యువాత పడుతున్నారు! ఈ క్రమంలో తాజాగా మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. ఆదివారం అదృశ్యమైన ఆ విద్యార్థి.. శవమై కనిపించాడు!
అవును... అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్శిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థి మృతిచెందాడు. ఈ మేరకు... ఇండియన్ స్టూడెంట్ నీల్ ఆచార్య మృతి చెందినట్లు మంగళవారం యూనివర్శిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్ క్లిఫ్టన్ తెలిపారు. ఇందులో భాగంగా... నీల్ మృతదేహాన్ని క్యాంపస్ లోని ఓ భవనం వద్ద గుర్తించామని వెల్లడించారు. దీంతో... తీవ్ర కలకలం రేగింది.
కాగా.. ఆదివారం మద్యాహ్నం 12:30 గంటల నుంచి తన కుమారుడు కనిపించడం లేదంటూ నీల్ ఆచార్య తల్లి గౌరీ ఆచార్య సోమవారం ఉదయం ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా... "మా అబ్బాయి నీల్ ఆచార్య జనవరి 28 నుండి కనిపించడం లేదు.. అతడు పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్నాడు.. అతన్ని చివరిసారిగా ఉబర్ డ్రైవర్ యూనివర్సిటీలో డ్రాప్ చేశాడు.. మేము నీల్ ఆచార్య కోసం వెతుకుతున్నాము.. సమాచారం తెలిస్తే మాకు సహాయం చేయండి" అని గౌరీ ఆచార్య పోస్ట్ చేశారు.
దీంతో గౌరీ ఆచార్య పోస్ట్ పై షికాగోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఇందులో భాగంగా... పర్డ్యూ యూనివర్శిటీ అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, కావాల్సిన సహకారాన్ని అందిస్తామని ఈ మేరకు హామీ ఇచ్చింది. అయితే... ఇంతలోనే నీల్ ఆచార్య మృతి చెందినట్లు పర్డ్యూ యూనివర్శిటీ ప్రకటించింది. ఈ విషయాలను కాలేజ్ మ్యాగజైన్ "ది ఎక్స్‌పోనెంట్"లోనూ ప్రచురించారు. అయితే... నీల్ ఆచార్య మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.