మోపిదేవి సీటు మీద మోజు లేదా ?

ఏపీలో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది.

Update: 2024-11-30 03:34 GMT

ఏపీలో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఈ మేరకు నామినేషన్ల ప్రక్రియ కూడా డిసెంబర్ లో ప్రారంభం అవుతుంది. ఈ మూడు సీట్లూ టీడీపీ కూటమికే దక్కుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎన్నుకునే రాజ్యసభ సభ్యుల ఎన్నిక కాబట్టి మొత్తం శాసన సభలో 164 మంది సభ్యులు కూటమికే ఉన్నారు కనుక బ్రహ్మాండమైన మెజారిటీతో ముగ్గురు రాజ్యసభ సభ్యులూ గెలుస్తారు.

ఇవన్నీ పక్కన పెడితే ఖాళీ అయిన ఈ మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి కేవలం రెండేళ్ల కాల పరిమితితో ముగిసేది ఉంది. మరో రెండు మాత్రం నాలుగేళ్ళ పదవీ కాలం కలిగినవి. రెండేళ్లలో ముగిసే సీటు మోపిదేవి వెంకట రమణ రాజీనామా చేసినదిగా ఉంది.

ఆయన 2020లో రాజ్యసభకు నెగ్గారు. ఆయన వదిలేయగా ఖాళీ అయిన ఈ సీటు పదవీకాలం 2026 జూన్ 21తో ముగుస్తుంది. అంటే డిసెంబర్ లో ఈ సీటు నుంచి ఎవరు నెగ్గినా గట్టిగా ఏణ్ణర్ధం మాత్రమే ఎంపీగా ఉంటారు అన్న మాట. దాంతో ఈ సీటు మీద మోజు పెద్దగా ఎవరూ చూపించడం లేదు అని అంటున్నారు.

డిమాండ్ అంతా మరో రెండు సీట్ల మీదనే ఉంది అని అంటున్నారు. ఆ సీట్లు ఎవరివి అంటే బీద మస్తాన్ రావు, ఆర్ క్రిష్ణయ్యలవి. ఈ రెండు సీట్ల పదవీ కాలం 2028 జూన్ 21 వరకూ ఉంటుంది. అంటే ఇపుడు ఈ సీట్ల నుంచి నెగ్గిన వారు హాయిగా మరో మూడున్నరేళ్ల పాటు కొనసాగవచ్చు అన్న మాట.

దాంతో ఎక్కువ కాల పరిమితి ఉన్న ఈ రెండు సీట్లకూ డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది అని ప్రచారం అయితే సాగుతోంది. ఇక ఏణ్ణర్ధం పదవీకాలం ఉన్న మోపిదేవి సీటు నుంచి ఎవరైనా పోటీ చేసినా వారికే 2026లోనూ మరోసారి ఈ సీటు కేటాయించాలి అన్న షరతు మీద మాత్రమే తీసుకుంటారు అని అంటున్నారు. ఈ సీటు ఎవరికి దక్కుతుందో చూడాల్సి ఉంది.

మరో వైపు చూస్తే 2026లో ఏకంగా మరో మూడు రాజ్యసభ సీట్లు ఏపీ నుంచి జూన్ 21న ఖాళీ అవుతాయి. అవి వైసీపీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వానీకి చెందినవి. దాంతో ఇపుడు ఎవరికైనా అకామిడేట్ చేయలేకపోతే అప్పుడు వారికి ఇవ్వవచ్చు అని కూటమిలోని ఆశావహులకు సర్దిచెబుతున్నారుట.

మొత్తానికి వైసీపీకి 2029 ఎన్నికల వరకూ చూసుకుంటే మిగిలేది ముగ్గురు ఎంపీలే రాజ్యసభలో అని అంటున్నారు. వారిలో ఒకరు వైవీ సుబ్బారెడ్డి, మరొకరి గొల్ల బాబూరావు ఇంకోకరు మేడ రఘునాధరెడ్డి అని అంటున్నారు. వీరి పదవీకాలం 2030 ఏప్రిల్ 1 దాకా ఉంది. మొత్తానికి టీడీపీ కూటమికి రానున్న 2026, 2028 ఎన్నికలతో కలుపుకుంటే ఎనిమిది సీట్లు కచ్చితంగా పెద్దల సభలో దక్కుతాయని అంటున్నారు.

Tags:    

Similar News