నాగబాబు గేమ్ చేంజర్ నా ?
మెగా బ్రదర్ నాగబాబు అసలు ఊహించి ఉండరు. తాను మంత్రి అవుతాను అని. నిజానికి ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు.
మెగా బ్రదర్ నాగబాబు అసలు ఊహించి ఉండరు. తాను మంత్రి అవుతాను అని. నిజానికి ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. ఏ పదవినీ కోరుకోని వారుగా కూడా అంతా చెబుతారు. ఆయనలో పదవీ దాహం లేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చాలు అంటారు. అదేంటి అంటే ఆయన అనకాపల్లి ఎంపీ సీటుకు జనసేన తరఫున అభ్యర్ధిగా వచ్చి కొన్ని రోజులు ప్రచారం చేసుకున్న తర్వాత సడెన్ గా ఆగిపోమని చెబితే సరే అని సింపుల్ గా అనేశారు.
అందువల్ల ఆయనకు పదవి పట్ల ఉండాల్సిన వ్యామోహం సగటు రాజకీయ నేతల మాదిరిగా లేదు అనే అంటున్నారు. అయితే నాగబాబుకు తగిన న్యాయం చేయాలని పట్టుదల పవన్ కళ్యాణ్ లో ఉంది. ఆయన జనసేన గెలుపునకు తెర వెనక ఎంతో చేశారు. ఆయన సైలెంట్ గా చేసిన వర్క్ పార్టీకి చాలా ఉపయోగపడింది.
ఆయన క్యాడర్ కి చాలా దగ్గరగా ఉంటారు. వారితో మమేకం అవుతారు. అటువంటి నాగబాబు ఇపుడు మంత్రి కాబోతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ఆయన ఎమ్మెల్సీగా పెద్దల సభలోకి అడుగుపెట్టాక మంత్రి పదవిని తీసుకుంటారు.
అయితే నాగబాబు ఒక్కరికే మంత్రి పదవి దక్కుతుందని ప్రస్తుతానికి ఉన్న ప్రచారం. ఎందుకంటే మంత్రులను తప్పిస్తే వేరే అర్ధాలు వస్తాయని జనాలకు తప్పుడు సమాచారం వెళ్తుందని కూడా అంటున్నారు. కనీసం ఏడాది కాలం పాటు అయినా ప్రస్తుతం ఉన్న మంత్రులను కొనసాగించి ఆ మీదట మార్పులు చేర్పులు చేయవచ్చు అంటున్నారు.
అయితే అదే సమయంలో వినిపిస్తున్న మరో వార్త ఏంటి అంటే మంత్రి పదవులకు ముప్పు లేకపోయినా కీలక శాఖల్లో ఉన్న వారికి స్థాన చలనం ఉంటుందని అంటున్నారు. నిజం చెప్పాలంటే మంత్రి వర్గంలో టాప్ పోర్టు ఫోలియోలు అన్నీ కొత్త వారికే దక్కాయి. అంటే ఒక్కసారి కూడా మంత్రి పదవి చేపట్టని వారికే ఆ శాఖలు లభించాయి.
వాటిని వారు ఎంత వరకూ నిభాయించారో అన్నది కూటమి ప్రభుత్వ పెద్దల వద్ద కచ్చితమైన అంచనా ఉంది. అలాగే నివేదికలు ఉన్నాయి. ఇక ఒక మంత్రి గారు హైదరాబాద్ లో పంచాయతీలు నిర్వహిస్తున్నారు అన్నది వార్తగా ఇటీవల వచ్చింది. ఆయన వద్ద ఘనమైన శాఖ ఉంది. మరో కీలకమైన శాఖ చూస్తున్న మహిళా మంత్రి ఆ శాఖను సమర్ధంగా నిర్వహించడం లేదు అని అంటున్నారు.
ఈ విధంగా చూస్తే కనుక కనీసంగా అరడజన్ మందికి తగ్గకుండా శాఖలలో భారీ మార్పు చేర్పులు ఉంటాయని అంటున్నారు. కీలక శాఖలను వేరొకరికి బదలాయిస్తారు అని అంటున్నారు. అదెలా అంటే ప్రస్తుతం తమ శాఖలలో మంచి పనితీరుని కనబరుస్తున్న వారికి ప్రమోషన్ ఇచ్చినట్లుగా కీలక శాఖలు కట్టబెట్టవచ్చు అని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే కూటమి ప్రభుత్వంలో కీలకమైన హోం శాఖ మీద ఈ మార్పు చేర్పులలో జనసేన పట్టుబట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆ శాఖను నాగబాబు కోసం కోరుతారు అని అంటున్నారు. నాగబాబు మంత్రిగా ఎంట్రీ ఇస్తున్నారు కానీ ఆయనకు అతి ముఖ్యమైన శాఖలే దక్కనున్నాయని అంటున్నారు.
నిజానికి గత కొంతకాలంగా నాగబాబు కి ఇచ్చే శాఖకు కందుల దుర్గేష్ శాఖల నుంచి తీసుకుని ఇస్తారు అని అంటున్నారు. కానీ అలా కాదని ఆయనకు ప్రధానమైన శాఖలనే ఇస్తారని ఆ విధంగా జనసేన కోరుతుందని అంటున్నారు.
మొత్తానికి ఈ ప్రచారం కనుక వాస్తవం అయితే కూటమి ప్రభుత్వంలో గేమ్ చేంజర్ గా నాగబాబు ఉంటారా అన్న చర్చ కూడా నడుస్తోంది. నాగబాబుకు కీలక శాఖలు దక్కితే మాత్రం జనసేనకు కూటమి ప్రభుత్వం భారీగానే రాజకీయ లాభం లభించినట్లు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంతమేరకు నిజం ఉందో.