ఆ తప్పుకు నారా లోకేశ్‌ క్షమాపణలు!

ఈ క్రమంలో నారా లోకేశ్‌ కాన్వాయ్‌ లోని ఒక కారు ఢీకొనడంతో కళ్యాణ్‌ భరద్వాజ్‌ అనే వ్యక్తి కారు డ్యామేజ్‌ అయ్యింది.

Update: 2024-09-25 08:06 GMT

తన కాన్వాయ్‌ వల్ల జరిగిన అసౌకర్యానికి చింతిస్తూ ఒక వాహనదారుడికి ఆం«ధ్రప్రదేశ్‌ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ క్షమాపణలు చెప్పారు. ఆయన ప్రస్తుతం విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేశ్‌ కాన్వాయ్‌ లోని ఒక కారు ఢీకొనడంతో కళ్యాణ్‌ భరద్వాజ్‌ అనే వ్యక్తి కారు డ్యామేజ్‌ అయ్యింది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ స్వయంగా బాధితుడు కళ్యాణ్‌ భరద్వాజ్‌ ఎక్స్‌ లో పోస్టు పెట్టారు. ఈ పోస్టును నారా లోకేశ్‌ కు ట్యాగ్‌ చేశారు.

‘‘లోకేశ్‌ గారూ.. నేను మీ పరిపాలనను, టీడీపీని చాలా ఇష్టపడతాను. మీరు అధికారంలోకి వచ్చినందుకు గర్విస్తున్నాను. కానీ, ఈరోజు విశాఖపట్నం హైవే వద్ద తాటిచెట్లపాలెం దగ్గర మీ కాన్వాయ్‌ వెళ్లేందుకు వీలుగా నా కారును రోడ్డు పక్కన నిలిపాను. అయినప్పటికీ మీ కాన్వాయ్‌ లోని ఓ వాహనం మా కారును ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయింది’’ అని భరద్వాజ్‌ ఎక్స్‌ లో సమస్యను లోకేశ్‌ దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా కారు డ్యామేజీ అయిన చిత్రాలను ఈ పోస్టుకు జత చేశారు.

ఈ నేపథ్యంలో కళ్యాణ్‌ భరద్వాజ్‌ పోస్టుకు నారా లోకేశ్‌ రిప్లై ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్‌ లో పోస్టు చేశారు. ‘‘మీకు నా హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను. నేను నా భద్రతా సిబ్బందికి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతాను. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలని ఆదేశాలిస్తాను. నా బృందం మిమ్మల్ని కాంటాక్ట్‌ చేస్తుంది. మీ కారుకు అయ్యే డ్యామేజ్‌ ఖర్చును నేనే భరిస్తాను’’ అని లోకేశ్‌ రిప్లై ఇచ్చారు.

లోకేశ్‌ పోస్టుకు కళ్యాణ్‌ భరద్వాజ్‌ తిరిగి రిప్లై ఇచ్చారు. తన కాంటాక్ట్‌ నంబర్‌ అంటూ ఒక ఫోన్‌ నంబర్‌ ను పేర్కొన్నారు. అలాగే లోకేశ్‌ స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే టీడీపీ శ్రేణులు, ఆ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలు కూడా లోకేశ్‌ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నాయకత్వ లక్షణాలను చూపించారు అంటూ కొనియాడుతున్నారు. నాయకుడి లక్షణం అంటే ఇలాగే ఉండాలని.. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోవడమే కాకుండా క్షమాపణ కూడా చెప్పడం గ్రేట్‌ అని అభినందిస్తున్నారు.

Tags:    

Similar News