చచ్చిపోయిన వైసీపీకి జీవం పొయొద్దు: తమ్ముళ్లకు లోకేష్ క్లాస్
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రజలకు పలు హామీలు గుప్పించారు.;

టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ గత ఎన్నికలకు ముందు రాష్ట్రంలో చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో ప్రజలకు పలు హామీలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆయా సమస్యలు పరిష్కరిస్తా మని చెప్పారు. ఈ హామీలను జనం విశ్వసించారు. కూటమి పార్టీలకు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలో నాడు యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. మంగళగిరిలో చేనేతలకు పూర్వ వైభవం తెస్తామన్న హామీనిఆయన నిలబెట్టుకున్న విషయం తెలిసిందే.
జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఇప్పుడు మంగళగిరి చేనేతల ప్రాభవం పరిఢవిల్లుతోంది. అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చిన పలు హామీలను కూడా నారా లోకేష్ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలపైనా లోకేష్ దృష్టి పెట్టారు. దీనిలో ప్రధానంగా వందల కోట్ల రూపాయల వ్యయమయ్యే ప్రాజెక్టుకు తాజాగా ఆయన శంకు స్థాపన చేశారు. సోమవారం.. అనకాపల్లి జిల్లాలో పర్యటించిన నారా లోకేష్.. యలమంచిలి నియోజకవర్గం అచ్చుతాపురం జంక్షన్‌లో రూ.243 కోట్లతో నిర్మించనున్న ఫ్లైఓవర్ కి, రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
వచ్చే రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్టు నారా లోకేష్ చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని పోగొట్టేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. తాను యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీల ను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని.. గతంలో తాను ఇక్కడ పర్యటించినప్పుడు.. రహదారులు గుంతలు పడి ఉన్నాయని.. ఇప్పుడు అద్దంలా మెరుస్తున్నాయని చెప్పారు. కూటమి సర్కారు వచ్చినా.. తల రాత మారదని ఎద్దేవా చేసిన వైసీపీ నాయకు లు ఇప్పుడు తమ తలరాతలను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రకు ఇచ్చిన ప్రతిహామీని తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు.
కూటములు వద్దు!
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలకు నారా లోకేష్ కొన్ని సూచనలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందని.. కూటమి పార్టీలతో కలిసి సఖ్యంగా ముందుకు సాగాలని వారికి సూచించారు. ఎవరికి వారు కూటములు కట్టే సంస్కృతి తీసుకురావద్దని, ఇలా జరిగితే.. మనం చేసిన తప్పుల కారణంగా చచ్చిపోయిన వైసీపీకి తిరిగి ప్రాణం పోసినట్టు అవుతుందని చెప్పారు. జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు కలిసి కట్టుగా ముందుకు సాగితే.. మరో 20 ఏళ్లపాటు మనదే అధికారమని ఆయన తేల్చి చెప్పారు. మరికొందరు నాయకులతో ఆయన ఏకాంతంగా చర్చించి.. నియోజకవర్గాల్లో రాజకీయాలను అడిగి తెలుసుకున్నారు.