నామినేటెడ్ పోస్టులపై మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
టీడీపీలో నామినేడెట్ పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలపై మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీలో నామినేడెట్ పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలపై మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యమిస్తామని చెప్పిన మంత్రి, మరో నెల రోజుల్లో పదవులను భర్తీ చేస్తామని తెలిపారు. అయితే వరుసగా రెండు సార్లు పదవులు తీసుకున్న నేతలు ఈ విడత ఖాళీగా ఉండాలని సూచించారు. దీంతో త్వరలో జరిగే నామినేడెట్ పోస్టుల పందేరంలో సీనియర్లకు ఝలక్ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీలో యువరక్తాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీనియర్లు ఈ సారి ఖాళీగా ఉండాలని మంత్రి సూచించడం టీడీపీలో హాట్ టాపిక్ అవుతోంది.
ఏపీలో టీడీపీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. పార్టీ స్థాపించిన నుంచి చాలా మంది లీడర్లు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ పార్టీ కోసం పనిచేసే నేతలకు టీడీపీలో కొదవలేదు. ఇలాంటి వారంతా పార్టీ అధికారంలోకి రాగానే నామినేడెట్ పదవులను ఆశిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉండగా, పార్టీ పదవుల్లో పనిచేసిన వారు, ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేనివారు ఇలా కొన్ని వందల మంది నామినేడెట్ పదవుల కోసం పోటీపడుతుంటారు. పార్టీ కూడా వీరందరికీ విడతల వారీగా అవకాశం ఇస్తుంటుంది.
అయితే ఈ సారి నామినేడెట్ పదవుల భర్తీని వేగంగా భర్తీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా మంది సీనియర్లను వెయిటింగులో పెట్టారు. త్వరలో వారికి పదవులు వరిస్తాయని ఎదురుచూస్తున్న వేళ, యువనేత టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ బాంబ్ లాంటి వార్త చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్, నామినేడెట్ పదవులను నెల రోజుల్లో భర్తీ చేస్తామన్నారు. అయితే వరుసగా రెండు సార్లు పదవులు అనుభవిస్తున్నవారికి అవసరమైతే ప్రమోషన్ ఇస్తామని లేదంటే ఈ సారికి ఖాళీగా ఉండాలని సూచించారు. అంటే పార్టీలో పొలిట్ బ్యూరోతోపాటు ఇతర పదవుల్లో ఉన్న నేతలకు స్థాన చలనం తప్పదనే సంకేతాలిచ్చినట్లైంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తూ సమర్థత చాటుకుంటున్న నేతలకు ప్రమోషన్ ఇస్తామని లోకేశ్ వివరించారు.
అంటే పార్టీ పరమైన పదవుల్లో కొత్త వారికి ఎక్కువ అవకాశాలిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నామినేడెట్ పదవుల విషయంలోనూ ఇదే సూత్రం అమలు చేస్తారని అంటున్నారు. దీంతో గతంలో పదవులు పొందిన వారికి ఈ సారి ఎలాంటి పదవీ దక్కే అవకాశాల్లేవంటున్నారు. పార్టీ ఆదేశిస్తే తాను గానీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ సామాన్య కార్యకర్తల్లా పనిచేయాల్సిందేనని మంత్రి చెప్పారు. దీన్నిబట్టి పార్టీ పదవులను ఆశిస్తున్న సీనియర్లకు ఈ సారి ఝలక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. కొత్తతరం కోటా కింద లోకేశ్ టీంలో పనిచేసే వారికి ప్రాధాన్యం దక్కనుందంటున్నారు.