ఎర్ర పుస్తకంలో పేర్లు రాయించుకుంటారా? లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేశ్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తాను రాసుకున్న రెడ్ బుక్ లో కొత్తగా పేర్లు రాయించుకోవద్దని సలహా ఇచ్చారు.;

Update: 2025-04-03 04:01 GMT
Nara lokesh Red Book Warning In ysrcp leaders

వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేశ్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. తాను రాసుకున్న రెడ్ బుక్ లో కొత్తగా పేర్లు రాయించుకోవద్దని సలహా ఇచ్చారు. ఈ సారి పేరు రాశానంటే అంతే సంగతులంటూ తేల్చిచెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా, రెడ్ బుక్ తెరిచిన టీడీపీ యువనేత లోకేశ్ ఇప్పుడు చేతిలో అధికారం ఉన్నా, రెడ్ బుక్ పేరును మళ్లీ ప్రస్తావించడం చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే రెడ్ బుక్ రాజ్యాంగమంటూ ప్రతిపక్షం విమర్శలు ఎక్కుపెడుతుండగా, అందులో పేర్లు ఉన్నవారంతా ఏదో రకమైన శిక్షను అనుభవిస్తున్నట్లే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ తాజా వార్నింగ్ ఎందుకు? అనేది ఆసక్తి రేపుతోంది.

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని బుధవారం పర్యటించిన మంత్రి నారా లోకేశ్ మరోసారి వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా, వైసీపీ నేతల చేష్టలను భరించామని, ఇప్పుడు మాత్రం అలా భరించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. కనిగిరిలో రిలయన్స్ ఎనర్జీ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లపై కొందరు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. సీబీజీ ప్లాంట్ల వల్ల ఎలాంటి అనారోగ్య, పర్యావరణ సమస్యలు లేకపోగా, కావాలనే రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేయడాన్ని లోకేశ్ తప్పుబట్టారు. ఇలా లేనిపోని మాటలతో అభివృద్ధిని అడ్డుకుంటే తాను చూస్తూ ఊరుకోనని, తాన వద్ద రెడ్ బుక్ ఉందని, అందులో మీ పేర్లు రాస్తానని వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపుతోంది.

టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం అణచివేతకు గురిచేసిందని, ఆ సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలు, అధికారులు, పోలీసుల పేర్లను తాను గుర్తించుకుంటానని గతంలో లోకేశ్ చెప్పారు. యువగళం పేరిట నిర్వహించిన పాదయాత్రలో వేధింపులపై టీడీపీ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో రెడ్ బుక్ తెరుస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు లోకేశ్. తొలిసారి రాయలసీమ జిల్లాల్లో రెడ్ బుక్ పై ప్రకటన చేసిన లోకేశ్ పాదయాత్రలో ప్రతిసభలో రెడ్ బుక్ ఉందని చూపుతూ నాటి అధికార పక్షాన్ని హెచ్చరించేవారు. ఆ సమయంలో లోకేశ్ వార్నింగులను తేలిగ్గా తీసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఆ ఫలితం అనుభవిస్తున్నారని చెబుతున్నారు.

గత ఏడాది జూన్ లో కూటమి అధికారంలోకి రాగానే మంత్రి లోకేశ్ రెడ్ బుక్ ప్రకారం నడుచుకుంటున్నారని ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది. ప్రభుత్వం కొలువుదీరిన నెల రోజుల్లోనే దేశరాజధాని ఢిల్లీలో ధర్నా చేసిన వైసీపీ మంత్రి లోకేశ్ రెడ్ బుక్ నే ప్రధానంగా హైలెట్ చేసింది. అంటే నెల రోజుల్లోనే రెడ్ బుక్ తడాఖా ఏంటో రుచి చూసిన వైసీపీ నేతలు తమ అధినేత జగన్ తో ఆ బాధ చెప్పుకోవడంతో మంత్రి లోకేశ్ పవర్ ఫుల్ గా పనిచేస్తున్నారని అందరికీ తెలిసింది. ఇక వైసీపీ నేతలపై కేసులు, అరెస్టులు అన్నీ రెడ్ బుక్ ప్రకారమే జరుగుతున్నట్లు ఆ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు గత ప్రభుత్వంతో అంటకాగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులు, ఇతర అధికారులకు కూడా రెడ్ బుక్ పనిష్మెంట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అప్రధాన పోస్టింగులతో అధికారులు, పోలీసుల కోరలు పీకేయడంతో మంత్రి లోకేశ్ రెడ్ బుక్ పేరు చెబితేనే హడలిపోయే పరిస్థితి నెలకొందని అంటున్నారు.

ఇప్పటివరకు గత ప్రభుత్వంలో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నవారి పేర్లే రెడ్ బుక్ లో ఉన్నాయి. వారిపైనే చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కూడా మంత్రి లోకేశ్ రెడ్ బుక్ కోసం ప్రస్తావిస్తుండటమే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. చేతిలో పూర్తిస్థాయి అధికారం ఉండగా, రెడ్ బుక్ రాయాల్సిన అవసరం ఏంటని ప్రశ్న తలెత్తుతోంది. అభివృద్ధిని అడ్డుకునే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కదా? అనే చర్చ జరుగుతోంది. అయితే అధికారంలో ఉన్నా, తన కార్యకర్తలను నిరంతరం ఆకట్టుకునేందుకే లోకేశ్ ప్రయత్నిస్తున్నారని, ఆయనలో మాస్ లీడర్ ఎలివేషన్ కోసం ఈ తరహా వార్నింగులిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా సరే పవర్ ఫుల్ లీడర్ లోకేశ్ మళ్లీ మళ్లీ రెడ్ బుక్ అంటూ హెచ్చరిస్తుండటం వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News