ఏనుగులను చంపుకు తిని.. కడుపు నింపుకోండి.. చీతాల నమీబియా నకనక

కాగా.. మనకు చీతాలను అందజేసిన దేశంలో భీకరమైన కరువు నెలకొంది.

Update: 2024-08-29 07:34 GMT

75 ఏళ్ల కిందటనే భారత్ లో అంతరించిపోయిన చీతాలను తిరిగి తీసుకొచ్చే ఉద్దేశంతో కేంద్రం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ చీతాకు సహకరించింది ఆ దేశం. తమదగ్గర వేలాదిగా ఉన్న చీతాల్లో కొన్నిటిని భారత్ కు అందజేసింది. ఇప్పుడవి త్వరలో అడవుల్లోకి వెళ్లి తమ సహజ జీవనాన్ని మొదలుపెట్టనున్నాయి. కాగా.. మనకు చీతాలను అందజేసిన దేశంలో భీకరమైన కరువు నెలకొంది. దీంతో ఈ దేశం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

ఎన్నడూ చూడని దుర్భిక్షం

నమీబియా.. ఉత్తర ఆఫ్రికా దేశం. అట్లాంటిక్ మహా సముద్రం, అంగోలా-జాంబియా, బోట్స్ వానా-జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాలు సరిహద్దులుగా ఉన్న దేశం. 1990లో దక్షిణాఫ్రికా నుంచే స్వాతంత్ర్యం పొందింది. ఈ దేశంలో 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు నెలకొంది. అసలే ఆఫ్రికా దేశం. అందులోనూ దుర్భిక్షం.. దీంతో ప్రజలకు కడుపు నిండా భోజనమే దొరకడం లేదు. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ప్రభుత్వం అడవి జంతువులను చంపుకొని తినమంటూ ప్రజలకు సూచించింది.

ఆ 700 జంతువులు కడుపులోకే..

ఆఫ్రికా ఖండం అంటేనే అరుదైన జీవులకు ప్రసిద్ధి. ముఖ్యంగా ఏనుగులు. భారీ జీవులైన వీటికి ఆఫ్రికా వాతావరణం చాలా అనుకూలం. కాగా, నమీబియా ప్రభుత్వం.. కరువును తట్టుకోలేక 700 అడవి జంతువులను చంపి.. వాటి మాంసాన్ని ప్రజలకు పంచాలని నిర్ణయించింది. ఈ జాబితాలో 83 ఏనుగులు, 30 నీటి గుర్రాలు (హిప్పోలు), 60 అడవి దున్నలు, 50 ఇంఫాలాలు, 100 బ్లూవైల్డ్‌ బీస్ట్‌ లు, 300 జీబ్రా లు ఉండడం గమనార్హం. అయితే, అడవులు, ఇతర ప్రదేశాల్లో వీటి సంఖ్య తగినంత ఉండడంతో వధించేందుకు సర్కారు అనుమతిచ్చింది. నిపుణులైన వేటగాళ్ల సాయం తీసుకోనుంది..

నమీబియాలో నేషనల్ ఎమర్జెన్సీ

దేశ జనాభాలో దాదాపు సగం మంది.. అంటే 14 లక్షల మంది కరువుతో అల్లాడుతుండడంతో నమీబియాలో నేషల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. అయితే, పెద్ద సంఖ్యలో జంతువులను చంపడంలో మరో ఆలోచన కూడా ఉంది. ఇవి లేకుంటే నీటి వనరులపై భారం తగ్గుతుంది. అటు ప్రజలకూ ఆహారం దొరుకుతుంది. కరువు కారణంగా.. పచ్చదనం తగ్గడంతో అటవీ జంతువులు ప్రజల ఇళ్లపైకి వస్తున్నాయి. చంపేందుకు అనుమతించిన 83 ఏనుగులు ఇక్కడివే.

ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలో 2 లక్షల పైగా ఏనుగులున్నాయి. ఒక్క బోట్స్ వానాలోనే 1.30 లక్షల ఏనుగులున్నాయి. కరువుతో నీరు దొరక్క నిరుడు పెద్ద సంఖ్యలో చనిపోయాయి. పదేళ్ల కిందటే వీటి వేటను నిషేధించినా.. ఐదేళ్ల కిందట పునరుద్ధరించారు. అయితే, ఏడాది ఇన్ని ఏనుగులను మాత్రమే వధించాలనేది నిబంధన. మరోవైపు బోట్స్ వానాలో కొందరికి ఏనుగులను చంపి మాంసం విక్రయమే ఆదాయ వనరు. ఈ దేశం అంగోలాకు 8 వేలు, మోజాంబిక్‌ కు 5 వేల ఏనుగులను ఇచ్చింది.

Tags:    

Similar News