ఒక వైపు వరదలు.. ఇంకోవైపు నరమాంసక బ్యాక్టీరియా!
ముఖ్యంగా విజయవాడలో సంభవించిన వరదలకు లోతట్టు ప్రాంతాల వారు తమ జీవితకాలంలో సంపాదించినవన్నీ పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలారు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు బెంబేలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలు, వరదలతో భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించాయి. ముఖ్యంగా విజయవాడలో సంభవించిన వరదలకు లోతట్టు ప్రాంతాల వారు తమ జీవితకాలంలో సంపాదించినవన్నీ పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలారు. మరికొందరు వరదకు బలయ్యారు.
వరదలతో అతలాకుతలమై సర్వం పోగొట్టుకుని బాధితులు అల్లాడుతుంటే మరోవైపు నరమాంసక బ్యాక్టీరియా కేసు ఒకటి వెలుగుచూసింది. వరద నీటి ద్వారా సంక్రమించే ఈ బ్యాక్టీరియా విజయవాడలో ఒక బాలుడికి సోకడంతో అతడి కాలును తీసేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. నైక్రోటైజింగ్ ఫాసిటిస్ అనే బ్యాక్టీరియా వరద నీరు లేదా వాన నీరు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని అంటున్నారు.
ముఖ్యంగా కాళ్ల మడమల వద్ద, కాళ్ల వెనుక భాగాల్లో మృదువైన కణజాలం ద్వారా నైక్రోటైజింగ్ ఫాసిటిస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత మృదువైన మెత్తటి శరీరాన్ని ఈ బ్యాక్టీరియా కొంచెం కొంచెం తినేస్తుంది.. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ ను వ్యాపించచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. చాలా త్వరగా ఈ ఇన్పెక్షన్ ఇతర శరీర భాగాల్లోకి ప్రవేశించి మనిషి ప్రాణాలను హరిస్తుందని వివరిస్తున్నారు.
ఫ్లష్ ఈటింగ్ బ్యాక్టీరియాగా కూడా పిలిచే ఈ నైక్రోటైజింగ్ ఫాసిటిస్ ను సోకిన వెంటనే గుర్తించాలని.. వెంటనే వైద్య చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. చికిత్స తీసుకోవడంలో ఎంత ఆలస్యం చేస్తే అంత ప్రమాదకరమని అంటున్నారు. కండరాలు చుట్టూ ఉన్న మృదు కణజాలాన్ని తినేసే ఈ బ్యాక్టీరియా శరీరం లోపల మాంసం మొత్తాన్ని తినేసి మనిషి మరణానికి కారణమవుతుందని చెబుతున్నారు. శరీరంలో అవయవాల వైఫల్యానికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఇటీవల కేరళలో మెదడును తినేసే బ్యాక్టీరియా కూడా ఇలాంటిదేనని చెబుతున్నారు. నైక్రోటైజింగ్ ఫాసిటిస్ సోకినవారికి తీవ్ర జ్వరం, బాగా చలి, కాళ్ల వాపులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. బ్యాక్టీరియా సోకిన శరీర భాగం చుట్టూ మంట కూడా ఉంటుందంటున్నారు. చర్మం రంగు మారుతుందని.. ఎర్రటి పొక్కులు ఏర్పడతాయని పేర్కొంటున్నారు. మనిషి శరీరంలోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే బ్యాక్టీరియా మరణానికి కారణమవుతుందని వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నైక్రోటైజింగ్ ఫాసిటిస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. చిన్నపాటి ఆపరేషన్ ద్వారా బ్యాక్టీరియా సోకిన శరీర భాగాన్ని తీసివేస్తారు. యాంటీబయోటిక్స్ ద్వారా త్వరగా కోలుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ బ్యాక్టీరియా సోకిన లక్షణాలు కనిపిస్తే ఆలస్యంగా చేయకుండా వీలైనంత తొందరగా చికిత్స తీసుకోవాలని పేర్కొంటున్నారు.