సొంత న్యాయవాదికే ఝలక్ ఇచ్చిన దొంగ

బుద్ధిగలవాడు తుంటరిల సహవాసు చేయడు అని పెద్దలు చెప్పారు. కానీ, ఓ న్యాయవాది తన వృత్తి ధర్మంలో భాగంగా ఓ మోటారు సైకిల్ దొంగను వాదించి తనే బాధితుడయ్యాడు

Update: 2024-12-23 23:30 GMT

బుద్ధిగలవాడు తుంటరిల సహవాసు చేయడు అని పెద్దలు చెప్పారు. కానీ, ఓ న్యాయవాది తన వృత్తి ధర్మంలో భాగంగా ఓ మోటారు సైకిల్ దొంగను వాదించి తనే బాధితుడయ్యాడు. ఈ షాకింగ్ సంఘటన మన తెలుగు రాష్ట్రాల్లోనే చోటుచేసుకుంది.

శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలిలో ఓ దొంగ తన న్యాయవాదికే దమ్కీ ఇచ్చాడు. జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు దొంగగా మారాడు. ఈజీ మనీకోసం ద్విచక్ర వాహనాలను దొంగిలించడం అలవాటుగా మార్చుకున్నాడు. రోడ్డు పక్కన బండి కనిపించిందంటే మాయం చేయడంలో దిట్టగా మారాడు. చేతిలో డబ్బు లేదంటే ఎవరి బండికో మూడిందన్నట్లే లెక్కగా చెలరేగిపోయాడు. ఇలా నెల్లూరు, కావలి పరిసర ప్రాంతాల్లో చాలా బైకులను ఎగరేసుకుపోయాడు. ఒక రోజు తన పాపం పండటంతో పోలీసులకు దొరికిపోయాడు. కట్ చేస్తే..

పోలీసులు అరెస్టు చేయడంతో జైలుకు వెళ్లిన సదరు దొంగ తనకు తెలిసిన వారి ద్వారా ఓ న్యాయవాదితో మాట్లాడుకున్నాడు. తనకు బెయిల్ ఇప్పించి తన కేసులను వాదించాలని కోరాడు. వృత్తి ధర్మంలో భాగంగా ఆ న్యాయవాది దొంగ తరఫున వకాల్తా పుచ్చుకున్నాడు. ఓ రోజు కోర్టు వాయిదా ఉందని సదరు దొంగను పిలిచాడు ఆ న్యాయవాది. న్యాయవాది ఆదేశాలతో కోర్టుకు వచ్చిన దొంగ... విచారణకు హాజరై, ఫీజుగా తన వద్ద ఉన్న డబ్బును న్యాయవాదికి సమర్పించుకున్నాడు. ఇక తిరుగు ప్రయాణంలో తనకు అలవాటైన పనిని కొనసాగించాడు. ఎంతైనా దొంగ కదా పోలీసులకు చిక్కినా తన బుద్ధిమార్చుకుంటాడా? ఏంటి... కోర్టు ఆవరణలో కనిపించిన బైక్ ఎత్తుకుపోయాడు.

దొంగ వెళ్లిన కాసేపటికి మిగిలిన కేసులను చూసుకుని ఇంటికి వెళ్దామని చూసిన న్యాయవాది బండి మాయమైంది. కోర్టు ఆవరణలో తన బండి కనిపించకపోయే సరికి షాక్ తిన్న న్యాయవాది వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. న్యాయవాది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పరిసరాల్లో సీసీ పుటేజీ చెక్ చేసి దొంగను గుర్తించారు. న్యాయవాది క్లెయింటే బైక్ ఎత్తుకుపోయాడని గుర్తించి, అతడి కోసం గాలింపు మొదలుపెట్టారు. తాను బెయిల్ పై బయటకు తెచ్చిన వ్యక్తే తన బైక్ దొంగిలించాడని తెలుసుకున్న న్యాయవాది పాముకు పాలు పోసి పెంచడమంటే ఇదేనేమో అంటూ తన చేసిన పనికి చింతిస్తున్నట్లు పోలీసులకు చెప్పాడట...

Tags:    

Similar News