బంగారం లాంటి నెటిజన్ల కోరిక... నిర్మలమ్మ తీరుస్తారా ?

ఈ బడ్జెట్ లో ఏఏ వర్గాలకు న్యాయం చేస్తారు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.

Update: 2025-01-29 18:02 GMT

వరసగా ఏడవసారి కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. ఫిబ్రవరి 1న ఆమె బడ్జెట్ ని సభకు సమర్పిస్తారు. 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి సబంధించిన ఈ బడ్జెట్ మీద దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ బడ్జెట్ లో ఏఏ వర్గాలకు న్యాయం చేస్తారు అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.

ఇక సోషల్ మీడియా యుగంలో నెటిజన్లు కూడా నేరుగా తమ ఆలోచనలు కోరికలను బాహాటంగా తెలియచేస్తున్నారు. తాజాగా చూస్తే నెటిజన్లు కొందరు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ని ఒక కోరిక కోరారు. అది బంగారం లాంటి కోరికగా చెప్పాలి.

ఈ రోజున బంగారం దేశంలో కొండెక్కి కూర్చుంది. తులం బంగారం లక్ష పై దాటి ఉంది. అది కూడా ఏ రోజు ఆ రోజు ఎగబాకుతోంది. చూస్తూండగానే చిన్నపాటి బంగారం కొందామన్న లక్షలు పట్టుకోవాల్సి వస్తోంది. దాంతో ఎటూ బంగారం ధరలు తగ్గించలేరు కాబట్టి అవి మధ్యతరగతి పేద వర్గాలు కొనుగోలు చేసుకునేలా వెసులుబాటుని కేంద్రం కల్పించాలని నెటిజన్లు కోరుతున్నారు.

ఇల్లు వస్తువులు గృహోపకరణాలు కొనుగోలు చేసుకోవాలంటే ఈఎంఐ సదుపాయం ఉంది. మరి బంగారానికి కూడా అలాంటి సదుపాయాన్ని కల్పించాలని కోరుతున్నారు. బంగారం ధరలు కొండెక్కిన నేపధ్యంలో ఈ విధంగా నెలవారీ చెల్లింపులకు అనుమతిస్తే పేద మధ్యతరగతి వర్గాలు కూడా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసుకునే వీలు ఉంటుందని అంటున్నారు.

బంగారం అన్నది ఎంత కాదనుకున్నా అత్యవసరమైన నిత్యావసరంగా మారుతోంది. బంగారం అన్నది భారతీయులకు సెంటిమెంట్ గా ఉంది. లక్ష్మీదేవిగా కూడా పూజించి ఆరాధిస్తారు. శుభ కార్యాలు చేసుకునే వారు అంతా బంగారాన్ని కొనుక్కుంటారు. బంగారం లేకుండా ఏ చిన్న పని కూడా ప్రారభించరు అన్నది తెలిసిందే. కరెన్సీ లేని రోజులలో బంగారమే అసలైన సంపదగా ఉండేది అని కూడా చెబుతారు.

అటువంటి బంగారం ఇపుడు అందని పండుగా మారింది. బంగారం పేదలకు పెద్దలకూ అందరికీ కావాలి. దాంతో దాని డిమాండ్ చెప్పనలవికాకుండా ఉంది. ఈ క్రమంలో బంగారం విషయంలో ఒక వరం ప్రసాదించమని అంటున్నారు. ఇప్పటిదాకా ఎవరూ కోరని కోరికను వ్యక్తం చేస్తున్నారు. మరి నెటిజన్ల కోరినను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మన్నించి ఆ మేరకు ఏమైనా వెసులుబాటు కల్పిస్తారా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News