బిగ్ క్వశ్చన్: వైసీపీకి విపక్ష హోదా దక్కేనా?

కూటమిలోని మిత్రపక్షాలు కాకుండా నిన్నటి వరకు అధికారపక్షంగా ఉన్న వైసీపీ కేవలం 14స్థానాల్లో మాత్రమే అధిక్యంలో ఉంది.

Update: 2024-06-04 08:11 GMT

ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకు 151 స్థానాల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీ.. అధికార పక్షంగా తాజా ఎన్నికల బరిలోకి దిగటం తెలిసిందే. ఇప్పటివరకు వెల్లడైన ఓట్ల లెక్కింపు వివరాల ప్రకారం చూస్తే.. 175 స్థానాల్లో 14 స్థానాల్లో మాత్రమే అధిక్యతను ప్రదర్శిస్తోంది. దీంతో.. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న సందేహం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా? అని. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మిశ్రమంగా రావటంతో ఏపీలో ఎవరిది గెలుపు? అన్నది సందేహంగా మారటం తెలిసిందే.

ఈ రోజు ఉదయం మొదలైన పోస్టల్ బ్యాలెట్ మొదలుకొని ఇప్పటివరకు (మధ్యాహ్నం ఒంటి గంట నాటికి) వెల్లడైన ఓట్ల లెక్కింపును చూస్తే.. తెలుగుదేశం పార్టీ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ పార్టీ సొంతంగానే 133 స్థానాల్లో అధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇందులో ఇప్పటికే ఐదు స్థానాల్లో విజయం సాధించింది. జనసేన విషయానికి వస్తే 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లోనూ అధిక్యతలో ఉండటం విశేషం. ఇక.. బీజేపీ ఆరుస్థానాల్లో అధిక్యతలో ఉంది. అంటే.. మొత్తంగా కూటమి 161 స్థానాల్లో తన అధిక్యతను ప్రదర్శిస్తోంది. ఈ 161 స్థానాల్లో ఆరు స్థానాల్లో ఇప్పటికే విజయాన్ని అధికారికంగా ప్రకటించారు.

కూటమిలోని మిత్రపక్షాలు కాకుండా నిన్నటి వరకు అధికారపక్షంగా ఉన్న వైసీపీ కేవలం 14స్థానాల్లో మాత్రమే అధిక్యంలో ఉంది. 92 శాతం స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా పయనిస్తున్నారు. అంటే.. వైసీపీ మొత్తం స్థానాల్లో 8 శాతం స్థానాల్లోనే అధిక్యతలో ఉన్నట్లు. కౌంటింగ్ చివరకు వచ్చేసరికి అందులో ఎన్ని నిలుస్తాయి? ఎన్ని చేజారుతాయి? అన్నది ఒక ప్రశ్న. ఒకవేళ.. ఇప్పుడు ఉన్న 14 స్థానాలే నిలిచినా.. ప్రతిపక్ష హోదా దక్కుతుందా? అన్నది ప్రశ్న.

సాంకేతికంగా చూస్తే.. ఏపీలో ఏదైనా పార్టీ ప్రతిపక్ష హోదాలో నిలవాలంటే ఆ పార్టీకి 18 స్థానాల్లో విజయం సాధించాలి. ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే.. వైసీపీకి కేవలం 14 స్థానాల్లోనే అధిక్యత ప్రదర్శిస్తోంది. ఆ మాటకు వస్తే జనసేన కంటే కూడా తక్కువ స్థానాల్లో వైసీపీ అధిక్యతలో ఉంది. ఈ నేపథ్యంలో.. వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కటం కూడా అనుమానమే అన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News