ఎన్టీఆర్ పై రూ.100 ప్రత్యేక నాణెం ఆవిష్కరణ.. నందమూరి, నారా ఫొటోలు వైరల్!
ఎన్టీఆర్‌కు సినీ, రాజకీయ రంగాల్లో సన్నిహితంగా మెలిగిన మరికొంతమంది కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
విఖ్యాత నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శత జయంతిని పురస్కరించుకుని కేంద్రం ప్రత్యేకంగా రూ.100 నాణెం తీసుకొచ్చింది. దీన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే తెలియని వారు లేరన్నారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తిరుపతిలో మహిళా వర్సిటీ ఏర్పాటు కూడా చేశారన్నారు. ఎన్టీఆర్ ఒకతరం హీరో మాత్రమే కాదని.. అన్ని తరాలకు ఆదర్శమని కొనియాడారు. సినీ, రాజకీయ రంగాల్లో చెరగని ముద్ర వేశారని వెల్లడించారు.
కాగా ప్రత్యేక నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ తనయులు నందమూరి బాలకృష్ణ, మోహన కృష్ణ, రామకృష్ణ, కుమార్తెలు.. పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరితో పాటు ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నారా లోకేశ్, బ్రాహ్మణిల కుమారుడు నారా దేవాన్ష్ సందడి చేశారు.
వీరితో పాటు టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, కేశినేని నాని, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, మాజీ ఎంపీలు సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌కు సినీ, రాజకీయ రంగాల్లో సన్నిహితంగా మెలిగిన మరికొంతమంది కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కాగా ఎన్టీఆర్ స్మారక నాణెంను హైదరాబాద్ లోనే తయారుచేశారు. హైదరాబాద్ మింట్‌లో తొలిసారి వ్యక్తి చిత్రంతో నాణెం ముద్రించడం ఇదే తొలిసారి. కాగా ఈ నాణేన్ని మార్కెట్‌లో చలామణి కోసం తీసుకురాలేదు. తొలి విడతలో 12 వేల స్మారక నాణేలు ముద్రించారు. రూ.3,500 నుంచి రూ.4,850 వరకు ఈ నాణేల ధర ఉంటుంది. ఆన్‌లైన్ తోపాటు హైదారాబాద్ లో 3 చోట్ల నాణేలను విక్రయిస్తున్నారు.