1000 కి.మీ. పాదయాత్ర... ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం!

ఎస్సీ వర్గీకరణ అంశం ఇప్పుడు ఆ సామాజికవర్గం ప్రజానికంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-25 04:44 GMT

ఎస్సీ వర్గీకరణ అంశం ఇప్పుడు ఆ సామాజికవర్గం ప్రజానికంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని, దీన్ని పూర్తిగా వ్యతిరేకించాలని మాలలు డిమాండ్ చేస్తుండగా.. వర్గీకరణ చేసి తీరాలని మాదిగలు అంటున్నారు! ఈ సమయంలో... 70 శాతం ఉన్న మదిగ, మాదిగ ఉపకులాలు 10 శాతం రిజర్వేషన్స్ ప్రయోజనాలు మాత్రమే పొందుతున్నాయనేది వారి ఆరోపణ!

ఇదే సమయంలో... 30 శాతం ఉన్న మాలలకు 90 శాతం ఉద్యోగాలు అందుతున్నాయనేది మాదిగల అభిప్రాయంగా ఉందని అంటున్నారు. ఎస్సీల్లో మాలల డామినేషన్ ఎక్కువనే చర్చ ఈ వర్గాల్లో ఉందని చెబుతుంటారు! ఈ సమయంలో ఎస్సీ రిజర్వేషన్ ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. దీన్ని మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు.

ఈ సందర్భంగా... దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉన్నంత కాలం ఎస్సీ వర్గీకరణ జరిగే విషయం కాదని.. ఎస్సీ వర్గీకరణ వైపు మొగ్గు చూపిన ఎన్డీయే ప్రభుత్వం తన గొయ్యి తానే తీసుకుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు పోరాటాలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో ఓ కీలక పరిణామం తెరపైకి వచ్చింది.

అవును... ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు మహాపాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 25న నిర్వహించే ఈ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ అంతా పూర్తయ్యింది. ఈ సమయంలో ఈ పాదయాత్రను జీవీ హర్షకుమార్ ఇవాళ ఈ యాత్రను ప్రారంభిస్తారు!

ఇందులో భాగంగా... భద్రాచలం నుంచి హైదరబాద్ వరకూ ఈ మహా పాదయాత్ర కొనసాగనుంది. ఈ క్రమంలో... 38 రోజుల పాటు, 16 జిల్లాలు, 35 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,000 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. నేడు (శుక్రవారం - అక్టోబర్ 25) న సాగబోయే ఈ యాత్ర డిసెంబర్ 1న ముగియనుంది.

ఈ సందర్భంగా... డిసెంబర్ 1న ఈ మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ మహా పాదయాత్రను, భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతున్నారు!

Tags:    

Similar News