మంత్రి పదవి కంటే టీడీపీ అధ్యక్ష పదవే గొప్పదంటున్న పల్లా

త్వరలో ఏపీ క్యాబినెట్ మంత్రి అవుతారనుకుంటున్న పల్లా శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

Update: 2024-12-31 11:50 GMT

త్వరలో ఏపీ క్యాబినెట్ మంత్రి అవుతారనుకుంటున్న పల్లా శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తనకు మంత్రి పదవి కన్నా, టీడీపీ అధ్యక్ష పదవే గొప్పదన్న పల్లా.. అసమర్థులకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేవారికి మంత్రివర్గంలో స్థానం ఉండదన్నారు. దీంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఏపీలో త్వరలో మంత్రివర్గం విస్తరిస్తే చోటు ఖాయమనుకుంటున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తన సొంత జిల్లా విశాఖలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు మంత్రి పదవిపై పెద్దగా ఆశలు లేవన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి మంత్రి పదవికన్నా గొప్పదని చెప్పుకొచ్చిన పల్లా.. అవినీతిపరులు, అసమర్థులను మాత్రమే మంత్రి వర్గం నుంచి తొలగిస్తారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో అలాంటివారు ఎవరూ లేరని, మంత్రి వర్గ విస్తరణపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపడేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల పక్షపాతి అని, తమ ప్రభుత్వంలో బీసీలకు పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. సీఎస్ గా విజయానంద్ ను ఎంపిక చేయడమే దీనికి పెద్ద ఉదాహరణగా పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు సైతం బీసీ అన్న విషయాన్ని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రెడ్డి సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యమిచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వంలో బీసీల రక్షణ చట్టం ప్రవేశపెడుతున్నామని తెలిపారు.

వైసీపీ హయాంలో బీసీ నాయకులను అణగదొక్కారని, బాపట్లలో చిన్నారి అమర్నాథ్ గౌడ్ ను దారుణంగా హత్య చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు అన్నివిధాల న్యాయం జరుగుతుందన్నారు. మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తాము ఎలా బాధ్యత వహిస్తామని పల్లా ప్రశ్నించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పైనా ఇలానే తప్పుడు ప్రచారం చేశారని ఖండించారు. వైసీపీ నేతలు చాలా మంది కూటమి పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, చేరికలపై కూటమి పార్టీలు మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుంటాయని పల్లా చెప్పారు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉగాది నుంచి అమలు చేస్తామని, దీని విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు.

Tags:    

Similar News