ఇల్లా అయితే ఎల్లా పల్లా ?

అయితే నాలుగు నెలల అధ్యక్ష బాధ్యతలలో ఆ విధంగా పెర్ఫార్మెన్స్ ఉందా అంటే కొంత అసంతృప్తి అయితే నేతలలో క్యాడర్ లో ఉంది అని ప్రచారం సాగుతోంది.

Update: 2024-10-06 16:47 GMT

ఆయన ఏపీ టీడీపీకి ప్రెసిడెంట్. ఆయన పార్టీ అధికారంలో కూడా ఉంది. ఆయనకు అతి పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ప్రభుత్వంతో పాటు పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంది. అయితే నాలుగు నెలల అధ్యక్ష బాధ్యతలలో ఆ విధంగా పెర్ఫార్మెన్స్ ఉందా అంటే కొంత అసంతృప్తి అయితే నేతలలో క్యాడర్ లో ఉంది అని ప్రచారం సాగుతోంది. ఆయనే పల్లా శ్రీనివాసరావు. ఆయన గాజువాక నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.

విభజన తరువాత ఏపీ టీడీపీ పదవిని క్రియేట్ చేశారు. దానికి ఉత్తరాంధ్ర కు చెందిన వారికే ఇస్తూ వచ్చారు. మొదటి సారి సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు ఇస్తే రెండవసారి మరో సీనియర్ నేత అచ్చెన్నాయుడు కు ఇచ్చారు. ఇద్దరూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీసీ నేతలే.

ఇక మరో బీసీ నేతగా పల్ల శ్రీనివాసరావుకు ఇచ్చారు. ఆయన బలమైన సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అచ్చెన్న టైంలో కళా టైం లో దూకుడుగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్లు ఉండేవారు అని పోలిక తెస్తున్నారు.

నిజానికి టీడీపీ ఫక్తు ప్రాంతీయ పార్టీ. తెలంగాణాలో కూడా పర్టీ ఉంది కాబట్టి రెండు రాష్ట్రాలు ఇద్దరు అధ్యక్షులు అని చెప్పి జాతీయ పార్టీగా మార్చుకున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రాంతీయ పార్టీగానే ఉంది. దాంతో పాటు టీడీపీ అధినాయకత్వం కూడా ఏపీకి చెందినదే. టీడీపీ ఆశలు బలాలూ అన్నీ ఏపీలోనే ఉన్నాయి. దాంతో జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రధాన కార్యదర్శిగా లోకేష్ కూడా ఏపీలోనే ఉంటూ అందుబాటులో ఉంటారు. దాంతో ఏపీకి టీడీపీ అధ్యక్ష పదవి అన్నది ఆరవ వేలు లాంటిదే అన్న భావన కూడా అందరిలో ఉంది.

కానీ ఉన్నంతలో కూడా తమ సత్తాను కళా, అచ్చెన్నా చాటారు అని అంటున్నారు. పల్లా అయితే పెద్దగా చడీ చప్పుడూ చేయడం లేదని అంటున్నారు. ఆయన పార్టీ పరంగా వైసీపీని విమర్శిస్తూ స్టేట్మెంట్స్ కూడా అంతగా ఇవ్వడం లేదని అంటున్నారు.

నిజానికి గతంలో ఏమి జరిగినా వైసీపీ నుంచి ఏమి వచ్చినా అచ్చెన్నాయుడు గట్టిగా విరుచుకుపడేవారు. అంతే కాదు పార్టీని కాచుకునేలా వ్యవహరించేవారు. పల్లా అయితే స్మూత్ గా వ్యవహరిస్తారు అంతగా దూకుడు చేయరని కూడా చెబుతారు. కానీ పదవి చేతిలోకి వచ్చాక దూకుడు చేయాలి కదా అని అంటున్నారు

ఇక నామినేటెడ్ పదవుల విషయంలో తమ్ముళ్ళు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఉత్తరాంధ్రాలో అయినా ముఖ్యులను గుర్తించి పదవులు ఇప్పించే విధంగా పల్లా చొరవ తీసుకుంటే ఆయన పదవికి తగిన న్యాయం జరిగేది అని అంటున్నారు. మరో వైపు చూస్తే విశాఖ ఉక్కు కర్మాగారం ఇష్యూ కూడా ఆయనకు ఇబ్బందిగా ఉంది. దాంతో కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి అని అంటున్నారు.

మొత్తానికి పల్లాకు అతి పెద్ద బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన తన స్పీడ్ ని మరింతగా పెంచాల్సి ఉందని అంటున్నారు. ఇటీవల పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీగా అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో విడిపోతే సర్దుబాటు చేయమని అధినాయకత్వమే పల్లాను సూచించి పంపించింది అని ప్రచారం సాగింది. ఇది తనంతట తాను చొరవ తీసుకుంటే బాగుండేది కదా అని అంటున్నారు.

అలాగే అనేక నియోజకవర్గాలలో కూటమి నేతల మధ్య పోరు సాగుతోంది. వాటిని తన వరకూ తన పరిధిలో సర్దుబాటు ఆయన చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. మొత్తానికి పల్లా జోరు పెంచాలని ఇలా అయితే ఎల్లా అని కూడా అంటున్నారు. చూడాలి రానున్న కాలంలో ఆయన జోరు పెంచి తన సత్తా చాటుతారేమో అన్నది.

Tags:    

Similar News