జగన్ కాదు .... పవన్ చేయాల్సింది అదేనా ?
పవన్ అంటేనే ఒక నిలువెత్తు ప్రశ్న. ఆయనలోని ఆవేశాన్ని ప్రశ్నించే తత్వాన్ని చూసే అంతా ఆకర్షితులయ్యారు.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జగన్ ని విమర్శిస్తూ పోతున్నారు. ఆయన మీడియా ముందు కానీ నిండు అసెంబ్లీలో కానీ జగన్ మీదనే హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆయన మాటలు ఇస్తున్న ప్రకటనలు ఎంతవరకూ జనంలోకి వెళ్తున్నాయి, ఎంతవరకూ అంగీకారంగా ఉంటున్నాయన్నది చూడాలని అంటున్నారు.
వైసీపీ అధినేత మీద విమర్శలు చేయడం వల్ల ఒరిగేది ఏముంది అన్నది ప్రస్తుతం చర్చగా ఉంది. ఆయనని దారుణంగా ఓడించి జనాలు పక్కన పెట్టేశారు. అదే సమయంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దాంతో ఆ పార్టీ తన రాజకీయ విధానాలు ఏమిటో ఎలా సాగాలో అలా సాగుతోంది. దాని వల్ల వచ్చే పర్యవసానాలు కూడా ఎదుర్కోవడం ఆ పార్టీకే ఉంటుంది.
అయితే జనసేన అధినేత కంటే ఇపుడు పవన్ ఉప ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న నాయకుడిగా జగన్ మీద విమర్శలు చేయడం ఎంతవరకూ సబబు అని అంటున్నారు. గవర్నర్ మీద గౌరవం లేదు అని అల్లరి చేశారు అని ఆయన చెప్పే మాటలలో సహేతుకత లేదని అంటున్నారు. గతంలో విభజన ఏపీలో వైసీపీ ఏలుబడిలో టీడీపీ అలాగే చేసింది. ఉమ్మడి ఏపీలో అలాగే చేశారు. గవర్నర్ వేరు, ఆయనకు ఇచ్చే గౌరవం వేరు. కానీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చదివేది ప్రభుత్వం ఇచ్చే నివేదికను. దాని మీదనే ఏ విపక్షం అయినా విమర్శలు చేస్తుంది. ఈ రెండింటికీ ముడి పెట్టడం పవన్ కి తగదని అంటున్నారు.
ఈ సంగతి ఇలా ఉంచితే పవన్ తొమ్మిది నెలల తమ ప్రభుత్వం మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తప్పులు లేవా అన్నది కూడా ప్రశ్నలుగా వస్తున్నాయి. ఇటీవల జరిగిన గ్రూప్ టూ అభ్యర్ధులకు జరిగిన అన్యాయం విషయంలో ఆయన ఇదేమని అడిగారా అన్న చర్చ ఉంది. అలాగే మిర్చీ రైతుల ఆందోళనలను ఆయన కాస్తా పట్టించుకుని యార్డుకు వెళ్ళి పరామర్శించినా బాగుండేది అన్న మాట ఉంది.
పవన్ అంటేనే ఒక నిలువెత్తు ప్రశ్న. ఆయనలోని ఆవేశాన్ని ప్రశ్నించే తత్వాన్ని చూసే అంతా ఆకర్షితులయ్యారు. అటువంటి పవన్ జనసేన అధినేతగా ఏమి అన్నా సరిపోతుంది. కానీ బాధ్యత కలిగిన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడిన ప్రతీ మాటా కౌంట్ అవుతుంది. జనాలు చూసేది కూటమి ప్రభుత్వాన్ని తప్ప జగన్ ని కానే కాదు. ఆయన అసెంబ్లీకే రాకపోవడం ద్వారా తన మీద ఫోకస్ ని కూడా లేకుండా చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో సభలో లేని ఆయనని నిందించి అనవసరంగా ప్రచారం చేసే బదులు ప్రజా సమస్యల మీద మాట్లాడవచ్చు. అలాగే ప్రభుత్వం కొన్ని చేసింది ఇంకా చేయాల్సి ఉంది వాటి మీద చెప్పవచ్చు. కానీ చిత్రంగా పవన్ ఎన్డీయే ప్రభుత్వం మూడు టెర్ములు ఉంటుంది సుదీర్ఘకాలం బాబే సీఎం అని రాజకీయ ప్రకటనలు నిండు సభలో చేయడం ఎంత వరకూ సబబు అన్న చర్చ వస్తోంది.
అయిదేళ్ళకు ఒకమారు తీర్పు ఇచ్చేది ప్రజలు. వారే న్యాయ నిర్ణేతలు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చి నిండా ఏడాది కాలేదు. అపుడే మరిన్ని ఎన్నికలు ఎన్డీయే కూటమితోనే అని చెప్పడం అసందర్భమే అవుతుంది అని అంటున్నారు. పైగా పవన్ నుంచే ఈ నినాదం వస్తోంది. బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ పెద్దగా రావడం లేదు
దాంతో కూటమి ఐక్యత కోసం పవన్ ఇలా అంటున్నారు అన్న సందేశం కన్నా జనసేన రాజకీయంగా తన బలహీనతను చాటుకుంటోందా అన్న అర్ధాలు వచ్చేలాగానే అధినేత ప్రకటనలు ఉన్నాయని అంటున్నారు. పొత్తులు ఎన్నికల సమయంలోనే ఉంటాయి. వాటికి ముందు రాజకీయ బేరాలు కూడా ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి వన్ సైడ్ గా ఎన్డీయే కూటమితోనే అంటూ దీర్ఘాలు తీస్తే అది జనసేనకు రాజకీయంగా భవిష్యత్తులో నష్టం చేస్తుందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇక సనాతన ధర్మం అని పవన్ ప్రవచిస్తున్న తీరు కూడా అత్యధిక జనమోదం పొందడం లేదని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన తన విధులను సక్రమంగా నిర్వహిస్తూ జనంలో చురుకైన నేతగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు. సనాతన ధర్మం అంటూ గుళ్ళూ గోపురాలు తిరగడానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్న మాటలను కూడా గమనంలోకి తీసుకోవాలని అంటున్నారు. అలాగే ప్రధాని మోడీ హిమాలయాలకు వెళ్తావా అని జోక్ చేశారని పవన్ మీడియాకు చెప్పారు. అయితే దాని వెనక ఆంతర్యం కూడా గ్రహించి ఆయన తీరు మొత్తం మార్చుకోవాలని సూచనలు వస్తున్నాయి.