పవన్ మార్క్ క్లారిటీ : ఇది వ్యక్తిగతం...నో పాలిటిక్స్ !
పవన్ సనాతన ధర్మం వెనక కూడా బీజేపీ అజెండా ఉందని కూడా చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ఆధ్యాత్మిక యాత్రల మీద రాజకీయ రచ్చ ఒక లెవెల్ లో సాగుతోంది. ఆయన వెనక బీజేపీ ఉందని దక్షిణాదిన బీజేపీ బలపడేందుకు పవన్ ని ముందు పెట్టి ఈ విధంగా చేస్తోంది అని ప్రచారం సాగుతోంది. పవన్ సనాతన ధర్మం వెనక కూడా బీజేపీ అజెండా ఉందని కూడా చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.
అయితే ఈ తరహా పుకార్లకు ప్రచారానికి పవన్ కళ్యాణ్ చెక్ పెట్టేశారు. ఆధ్యాత్మిక యాత్ర అన్నది పూర్తిగా వ్యక్తిగతం అన్నారు. తాను ఒకనాటి మొక్కులను చెల్లించుకోవడానికే ఈ విధంగా దేవాలయ దర్శనానికి వచ్చానని మీడియాకు ఆయన చెప్పారు. ఇందులో రాజకీయాలు మరేవీ లేవని ఆయన స్పష్టం చేశారు.
తనకు ఇపుడు ఆరోగ్యం సహకరించకున్నా ఈ యాత్రలను చేయడం జరుగుతోందని అన్నారు. అదే సమయంలో ఆయన తిరుమల లడ్డూల విషయంలోనూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలలో విషయంలో దోషులను ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేయడం మంచి పరిణామమని అన్నారు. భవిష్యత్తులో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు చేపట్టాలని కోరారు.
తిరుమలలోని ఏడుకొండల స్వామి వారి దర్శనానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అటువంటి భక్తుల మనోభావాలను కాపాడాల్సిన అవసరం ఉందని పవన్ అన్నారు. కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకంతో ఆధ్యాత్మిక చింతనతో తిరుమలకు వస్తారని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే తిరుమల లడ్డూలో కల్తీ జరగడం దురదృష్టకరం అని పవన్ అన్నారు.
మర్ఫో వైపు చూస్తే ఎర్ర చందనం అమ్మకం విషయంలో దేశం మొత్తం నూతన విధానం తీసుకుని రావాలని కేంద్రాన్ని కోరామని పవన్ చెప్పారు. ఎర్ర చందనం అక్రమ రవాణా జరిగినపుడు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారని అయితే దీని మీద ఒక కొత్త పాలసీ రావాల్సి ఉందని అన్నారు.
ఇదిలా ఉంటే పవన్ ఆధ్యాత్మిక యాత్ర విషయంలో బీజేపీ లేదు అన్నది ఆయన మాటల ద్వారా స్పష్టం చేశారు. అదే సమయంలో తిరుమల లడ్డూ కల్తీ అయిందని పవన్ చెబుతున్నారు. దీంతో వీటి మీద చర్చ మొదలైంది. ఇక పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సహకరించనున్నా యాత్ర చేపడుతున్నాను అని చెప్పడం ద్వారా తాను ప్రభుత్వ కార్యక్రమాలలో ఎందుకు పాల్గొనడంలేదో వివరణ ఇచ్చారని అంటున్నారు. తిరుమలలో భవిష్యత్తు భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాల్సిన అవసరం ఉందని బోర్డుకు ఆయన సూచించడం ద్వారా అప్రమత్తం చేశారు.
ఇలా పవన్ మీడియా ముఖంగా చాలానే చెప్పారు. అయితే పవన్ ఇంకా మూడు రోజుల పర్యటన ఉంది. ఆయన ఈ పర్యటనలో మరిన్ని మీడియా సమావేశాలు నిర్వహించవచ్చు. ఆ సమయంలో ఆయన మరిన్ని ప్రకటనలు చేయవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ ఆధ్యాత్మిక యాత్ర మాత్రం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది అనే చెప్పాల్సి ఉంటుంది.