తెలంగాణ ఎన్నికల్లో పోటీ.. పవన్‌ మిస్టేకేనా?

వాస్తవానికి జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ తన దృష్టంతా ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనే పెట్టడంతో ఈసారి తెలంగాణలో పోటీ చేయకపోవచ్చని చర్చ జరిగింది

Update: 2023-10-05 07:51 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇక సమయం దగ్గర పడుతోంది. రేపో, మాపో ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్‌ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్, డిసెంబర్‌ మొదటి వారంలో ఎన్నికలు ఉండొచ్చని చర్చ జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం తెలంగాణలో పర్యటించింది. అన్ని ఏర్పాట్లను పరిశీలించింది. ఓటర్ల జాబితాలను ఫైనల్‌ చేస్తోంది.

మరోవైపు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తం 32 స్థానాల్లో జనసేన తన అభ్యర్థులను బరిలోకి దించుతోంది. ఈ మేరకు పోటీ చేసే 32 స్థానాలను కూడా ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా జనసేన పోటీ చేస్తుండటం గమనార్హం.

వాస్తవానికి జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ తన దృష్టంతా ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనే పెట్టడంతో ఈసారి తెలంగాణలో పోటీ చేయకపోవచ్చని చర్చ జరిగింది. అందులోనూ జనసేన.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో ఉండటం, ఏపీలో బీజేపీతో పొత్తులో ఉండటంతో ఆ పార్టీకే తెలంగాణలో జనసేన మద్దతిస్తుందని రాజకీయ పరిశీలకులు భావించారు.

అయితే అనూహ్యంగా స్కిల్‌ డెవలప్మెంట్‌ స్కాంలో చంద్రబాబు అరెస్టు అయ్యాక ఆయనను జైలుకెళ్లి పరామర్శించిన పవన్‌ టీడీపీతో పొత్తుకు దారులు తీశారు. ఆ తర్వాత తెలంగాణలో 32 స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు.

అయితే పవన్‌ నిర్ణయం రాజకీయ తప్పిదమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో పవన్‌ కళ్యాణ్‌ కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నప్పటికీ, మున్నూరు కాపు సామాజికవర్గం బలంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్‌ నగర పరిధిలో కొన్ని చోట్ల ఆంధ్రా కాపులు భారీగానే ఉన్నప్పటికీ జనసేన ఓట్లను చీల్చగలగడమే తప్ప గెలవగలిగే పరిస్థితి లేదని అంటున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్‌ నగర పరిధిలో సీమాంధ్రులు ఎక్కువగా నివసించే కూకట్‌ పల్లి, ఎల్బీనగర్, సనత్‌ నగర్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి తదితర స్థానాల్లో కొంతవరకు జనసేన ఓట్లు చీల్చగలదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతకు మించి ఫలితాలు ఆశించడం అయితే కష్టమంటున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో 32 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవకపోతే అది ఆంధ్రాలో దెబ్బతీసే అంశం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జనసేనకు తెలంగాణలో ఒక్కటి కూడా రాకపోతే దాన్ని వైసీపీ ప్రచార అస్త్రంగా మార్చుకుంటుందని అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ను తెలంగాణ ప్రజలు తిరస్కరించారని.. ఆంధ్రాలో కూడా ఆయనకు అదే గతే పడుతుందని విమర్శించే అవకాశం ఉందని చెబుతున్నారు.

అందులోనూ తెలంగాణ ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు వచ్చిన నాలుగు నెలలకు కానీ ఏపీ ఎన్నికలు జరగవు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీపైనా ఉంటుందని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పోటీ చేయాలని పవన్‌ తీసుకున్న నిర్ణయం ఆయనకు ప్లస్‌ కంటే మైనస్‌ అయ్యే ప్రమాదమే ఎక్కువ ఉందని అంటున్నారు.

తెలంగాణలోనూ టీడీపీతో కలిసి పోటీ చేస్తే సీమాంధ్రులు ఎక్కువగా ఉన్నచోట, ముఖ్యంగా కాపులు, కమ్మలు ఎక్కువ ఉన్న కూకట్‌ పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్‌ వంటి నియోజకవర్గాలను గెలుచుకునే అవకాశం ఉండేదని.. లేదంటే కనీసం గట్టిపోటే ఇచ్చే చాన్సు అయినా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించి పవన్‌ తప్పు చేశారని అంటున్నారు.

Tags:    

Similar News