అందుకే వెళ్లలేకపోయా... అర్ధం చేసుకోండంటూ పవన్!

బెజవాడను వరద బీభత్సం అతలాకుతలం చేసి పారేసింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు అంతా వరద ప్రాంతాలకు వెళ్లారు.

Update: 2024-09-03 17:40 GMT

బెజవాడను వరద బీభత్సం అతలాకుతలం చేసి పారేసింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు అంతా వరద ప్రాంతాలకు వెళ్లారు. సహాయ కార్యక్రమాలలో పాల్గొన్నారు. విపక్ష నేత జగన్ కూడా వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.

కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే వెళ్లలేదు. దీని మీద పెద్ద ఎత్తున మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ చర్చ సాగింది. పవన్ ఎక్కడ ఉన్నారని డిబేట్లు పెట్టిన వారూ ఉన్నారు మొత్తానికి ఈ డౌట్లకు పవన్ ఒక ఆన్సర్ అయితే ఇచ్చారు. తాను ఎందుకు వెళ్లలేదు అంటే సహాయానికి ఆటంకం కలగకూడదు అనే అని పవన్ మీడియా ముఖంగా వివరణ ఇచ్చారు.

ఆయన ప్రకృతి విపత్తుల ఆఫీసులో హోం మంత్రితో పాటు ఇతర అధికారులతో కలసి వరద పరిస్థితుల మీద సమీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలను పంచుకున్నారు. నేను వరద ప్రాంతాలకు వెళ్తే సహాయ చర్యలకు ఇబ్బంది అవుతుందని అధికారులు చెప్పారని అన్నారు. సహాయం చేయాలి తప్ప మరేమీ ఇబ్బందులు రాకూడదు అని తాను వెళ్ళలేదు అని పవన్ చెప్పారు.

నేను కనుక అక్కడికి వెళ్తే జనాలు వచ్చి మీదన పడితే అపుడు ఏమి జరుగుతుందో ఊహించండి అని పవన్ అన్నారు. అందుకే తాను అధికారుల సూచనలు పాటించాను అని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కి విఘాతం కలగకూడదు అన్నదే తన ఆలోచన అని పవన్ చెప్పారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నాను అని పవన్ చెబుతూ అర్థం చేసుకోవాలని కోరారు.

పవన్ కళ్యాణ్ కి ఉన్న అపరిమితమైన సినీ గ్లామర్ వల్ల జనాలు మాస్ గా వస్తే అపుడు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. ఇదిలా ఉండగా గత ప్రభుత్వం నిర్వాకం వల్లనే ఈ రకమైన ఇబ్బందులు వచ్చాయని అన్నారు. ప్రాజెక్టులకు సరైన మరమ్మత్తులు చేయలేకపోయారు అని అన్నారు. అదే విధంగా ముంపు అన్నది తెలంగాణా నుంచి వచ్చిన వరదనీరు కూడా తోడు కావడంతో వచ్చిందని అన్నారు.

అయినా సరే అతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నామని పవన్ అన్నారు. దీనికి దేవుడి దయ కారణం అని అంటూ మరో 12 లక్షల క్యూసెక్కుల నీరు కనుక వచ్చి ఉంటే అతి పెద్ద ప్రమాదం అయ్యేదని అన్నారు. ఇక ప్రతీ నగరానికి ఒక మాస్టర్ ప్లాన్ అవసరం అని ఆయన అన్నారు ఇది ఒకరిని నిందించే సమయం కాదని బాధితులకు అన్నీ అందాల్సిన అవసరం ఉంది అని అన్నారు.

తమ ప్రభుత్వం ఈ విషయంలో సకల జాగ్రత్తలు తీసుకుంది అని ఆయన అన్నారు ముఖ్యమంత్రి మంత్రులు అహర్నిశలు పనిచేస్తున్నారు అని ఆయన అన్నారు. అలాగే అధికారులు అంతా సేవా కార్యక్రమాలలో నిమగ్నం అయ్యారని కూఒడా అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తూ వరద బాధితుల సహాయ చర్యలలో పాలు పంచుకుంటోందని అన్నారు. ఇదిలా ఉంటే పవన్ కోటి రూపాయల ఆర్ధిక సాయాన్ని తమ పార్టీ తరఫున ప్రకటించారు. దానిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్ రూపంలో అందచేయనున్నట్లుగా ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News