వైసీపీ మీద పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !
వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీ నేతలు క్యాడర్ భరోసా కోల్పోయి ఇతర పార్టీలలో చేరుతూండడంతో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైసీపీ మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో నాయకులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అధినాయకుడు తప్పులు చేస్తే శిక్ష మాత్రం ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు పడుతుందని ఆయన అన్నారు. వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీ నేతలు క్యాడర్ భరోసా కోల్పోయి ఇతర పార్టీలలో చేరుతూండడంతో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు.
విశాఖలో స్థాయీ సంఘం ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అయిదుగురు కార్పోరేటర్లు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళి చేరారు. వారిని జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు విశాఖ సౌత్ అసెంబ్లీ ఎమ్మెల్యే వంశీ క్రిష్ణ శ్రీనివాస్ మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసుకు తీసుకుని వచ్చారు.
వారి మెడలో కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన పవన్ కళ్యాణ్ వైసీపీ మీద ఈ సందర్భంగా కామెంట్స్ చేశారు. వైసీపీతో రాజకీయంగా విభేదిస్తున్నామే తప్ప వ్యక్తిగతంగా ఏమీ లేదని అన్నారు. వైసీపీ ఓటమి వెనక నాయకుల తప్పు ఉందన్నట్లుగా ఆయన కామెంట్స్ చేశారు దాని ఫలితం క్యాడర్ చూస్తోందని అందుకే వారు వేరే అవకాశాలు వెతుక్కుంటున్నారు అన్న అర్ధంలో పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.
జనసేనలో క్యాడర్ కూడా అన్ని విధాలుగా ఎదగాలి అన్నది తన ఆశయం అని పవన్ అన్నారు. వారు రాజకీయంగానే కాదు ఇతరత్రా ఎదగాలని ఆయన కోరారు. విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవాలని ఆయన కోరుకున్నారు. జనసేనలో చేరిన కార్పోరేటర్లు అంతా పేదల కోసం పనిచేయాలని పవన్ సూచించారు. ప్రజా సమస్యలను ప్రస్తావించాలని అని అన్నారు.
ఇక తాను తొందరలో విశాఖలో పర్యటిస్తాను అని ఆయన అన్నారు. విశాఖలో రియల్ ఎస్టేట్ కి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయని పవన్ అన్నారు. అలాగే విశాఖలో పొల్యూషన్ ఆడిట్ ని నిర్వహిస్తామని పవన్ చెప్పారు. ఇదిలా ఉంటే వైసీపీకి చెందిన ఐదుగురు కార్పోరేటర్లతో పాటు కీలక నేతలు జనసేనలో చేరడం విశేషం.
దాంతో స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమికి విజయావకాశాలు పెరిగాయి. ఇప్పటికే టీడీపీలో తొమ్మిది మంది దాకా కార్పోరేటర్లు చేరారు. ఇపుడు జనసేనలో అయిదుగురు చేరారు. దాంతో మొత్తం 59 మంది కార్పొరేటర్ల మద్దతు ఉన్న వైసీపీ బలం జీవీఎంసీలో ఏకంగా 45కి పడిపోయింది. ఇందులో కూడా కొందరు జంప్ అవుతారని అంటున్నారు. కచ్చితంగా యాభై మంది దాకా ఉంటేనే స్థాయి సంఘం ఎన్నికల్లో గెలుపు సాధ్యపడుతుంది. కానీ వైసీపీ తన బలాన్ని కోల్పోయింది. మరి వైసీపీ స్థాయి సంఘం ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తుందా అనుకోని పరిణామాలు జరుగుతాయా అన్నది చూడాల్సి ఉంది.