లీటరుకు రూ.2తో వచ్చే ఆదాయం రూ.32వేల కోట్లు

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్.. డీజిల్ భారాన్ని తగ్గిస్తారని అందరూ భావించారు. అలా చేస్తే ఆయన మోడీ మాష్టారు ఎందుకు అవుతారు.;

Update: 2025-04-09 07:30 GMT
లీటరుకు రూ.2తో వచ్చే ఆదాయం రూ.32వేల కోట్లు

ఏ చిన్న అవకాశం దొరకాలే కానీ మోడీ మాష్టారు అస్సలు ఊరుకోరు. లెక్కల విషయంలో ఆయన చాలా పక్కా. అన్నింటికి మించి వడ్డింపుల విషయంలో ఎంత కఠినంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్.. డీజిల్ భారాన్ని తగ్గిస్తారని అందరూ భావించారు. అలా చేస్తే ఆయన మోడీ మాష్టారు ఎందుకు అవుతారు.

ముడిచమురు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో.. ఆ తగ్గింపును ప్రజలకు ఇచ్చే బదులుగా.. కంపెనీలకు వేసే ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.2 చొప్పున పెంచేయటం తెలిసిందే. కాకుంటే.. ఈ పెంపు ప్రజల మీద నేరుగా ప్రభావం చూపని రీతిలో కంపెనీలకు వాత పెట్టింది మోడీ సర్కారు. ఈ వడ్డనతో కేంద్రానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాల రూ.32 వేల కోట్లుగా లెక్క కట్టారు. పెంచిన సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో కేంద్ర పెట్రోలియం.. సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి.. పెంచిన సుంకంతో కేంద్రానికి వచ్చే అదనపు ఆదాయం ఎంతన్న లెక్క వేశారు.

ఇంత లాభం వస్తుందా? అన్న ఆశ్చర్యానికి గురయ్యేలోపు.. ఆయనో మాటను చెప్పుకొచ్చారు. 2024-25లో చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ.41 వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయని.. తాజాగా పెంచిన సుంకంతో సదరు నష్టాల్ని పూడ్చుకునేందుకు వినియోగిస్తామని చెప్పారు. ప్రస్తుతం పెంచిన సుంకంతో వచ్చే వసూళ్లు.. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు వెళ్తాయన్నారు.

ఆ తర్వాత వీటిని చమురు మార్కెటింగ్ కంపెనీలకు బదిలీ చేసేలా ఆర్థిక శాఖ చమురుశాఖను సంప్రదిస్తుందని చెప్పారు. ఇక.. రెండురోజుల క్రితం వంటగ్యాస్ సిలిండర్ మీద రూ.50 చొప్పున పెంపుతో రాయితీ మీద ఇచ్చే ఉజ్వల సిలిండర్లతో వచ్చే నష్టాల్ని చమురు కంపెనీలు పూడ్చుకుంటాయని చెప్పుకొచ్చారు. చూశారా.. మోడీ సర్కారు లెక్కల విషయంలో ఎంత పక్కాగా ఉంటుందో?

Tags:    

Similar News