నాగబాబు మెగా ఎంట్రీ....వర్మకు షాక్
పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాగబాబు ప్రారంభోత్సవాలు చేశారు.;

పిఠాపురం రాజకీయాలు ఇపుడు రసకందాయంలో పడ్డాయి. పిఠాపురం పేరు చెప్పగానే వినిపించే పేరు పవన్ కళ్యాణ్ అని. ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా 2024 ఎన్నికల్లో తొలిసారి గెలిచారు. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇక ఆయన సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఎమ్మెల్సీ అయ్యారు.
ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయడమేంటి అలా పిఠాపురంలో అడుగుపెట్టారు. దాంతో పిఠాపురంలో నాగబాబుకు అదిరిపోయే లెవెల్ లో ఘన స్వాగతం లభించింది. పిఠాపురం గొల్లప్రోలు మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. బాణా సంచా పేలుస్తూ పూల వర్షం కురిపిస్తూ నాగబాబుకు అపూర్వమైన ఆదరణతో ఆహ్వానం పలికారు.
పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నాగబాబు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ ప్రారంభోత్సవాలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉంది కానీ ఆయనకు తీరుబాటు లేకపోవడంతో నాగబాబు చేశారు. ఆయన ఎమ్మెల్సీ కావడంతో అధికార హోదాలోనే చేశారు.
గొల్లప్రోలు లోని హెడ్ వాటర్ వర్క్స్ లో మంచి నీటి సరఫరా కేంద్రంలో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు అన్న క్యాంటీన్ ని నాగబాబు ప్రారంభించారు. ఇలా నాగబాబు ఎమ్మెల్సీ కాగానే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టడం అంటే భవిష్యత్తులో ఆయనే పిఠాపురంలో అన్నీ తానై వ్యవహరిస్తారు అన్నది అందరికీ తెలిసేలా చేస్తున్నారు అని చర్చ సాగుతోంది.
ఇదిలా ఉంటే నాగబాబు పర్యటన విషయంలో పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మకు ఆహ్వానం అందలేదని అంటున్నారు. కూటమిలో జనసేన టీడీపీ బీజేపీ ఉన్నాయి. ఏ కార్యక్రమం చేపట్టినా మూడు పార్టీల నేతలు కనిపించాలి. కానీ పిఠాపురంలో అది జరగలేదు అని అంటున్నారు పైగా టీడీపీ నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న వర్మకు పిలుపులు లేకపోవడం పట్ల ఆయన అనుచరులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే వర్మకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అనుచరులు పలు సందర్భాలలో ఘర్షణలకు దిగిన దాఖలాలు ఉన్నాయి మరి నాగబాబు పర్యటన విషయంలో వర్మ అనుచరులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే నాగబాబు పర్యటన సందర్భంగా భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం పట్ల కూడా చర్చ సాగుతోంది. ఆయన కేవలం ఎమ్మెల్సీ హోదాతోనే ఉన్నారు. కానీ ఆయనకు పెద్ద ఎత్తున సెక్యూరిటీని ఇవ్వడం పట్ల కూడా ఆలోచిస్తున్నారు. సీఎం లేక ఉన్నత స్థాయి వ్యక్తులకు ఇచ్చే సెక్యూరిటీని నాగబాబుకు ఇవ్వడం మీద కూడా చర్చ సాగుతోంది.
నాగబాబు ఏమీ తీవ్రవాదులు మావోయిస్టుల లిస్ట్ లో లేరని ఆయనకు ఇంత భారీ బందోబస్తు ఏమిటి అని విస్తుబోతున్నారు. కేవలం అధికార దర్పం చూపించడానికేనా ఈ రకమైన బందోబస్తు అన్నది కూడా మాట్లాడుకుంటున్నారు.
పెద్ద సంఖ్యలో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు ద్వారా వేరే విధంగా సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. ఈ వైఖరుల వల్ల ముందు ముందు జనసేనతో పాటు కూటమి పార్టీలకు రాజకీయంగా ఇబ్బంది వస్తుందని అంటున్నారు.
ఇక వర్మ విషయానికి వస్తే నాగబాబు ఎంట్రీతో ఆయనకు కూటమిలో ప్లేస్ ఏంటో తెలిసిపోయింది అని అంటున్నారు. ఆయన దాదాపుగా ఒంటరి పోరాటమే చేయాలని అంటున్నారు. పొత్తులో భాగంగా ఒకసారి కాదు పర్మనెంట్ గానే జనసేనకు ఈ సీటు ఇచ్చేశారు అని అంటున్నారు. వర్మ సర్దుబాటుకు సిద్ధపడినా ఇంతలా పెరిగిన ఈ గ్యాప్ లో సాధ్యపడక పోవచ్చు అని అంటున్నారు. అందువల్ల ఆయన రాజకీయంగా ఎదురీత ఈదాల్సిందే అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే నాగబాబు జనసేనలో టాప్ లెవెల్ లీడర్ అని నిరూపించేలా పిఠాపురం జనసేన అడ్డా అనేలా ఆయన టూర్ సాగింది అని అంటున్నారు.