మళ్లీ తెరపైకి బియ్యం కేసు.. పేర్ని నానిని అంత తేలిగ్గా వదలరా?

మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు చెందిన గోడౌన్ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోయారని కొన్ని నెలల కిందట ప్రభుత్వం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.;

Update: 2025-04-01 09:25 GMT
మళ్లీ తెరపైకి బియ్యం కేసు.. పేర్ని నానిని అంత తేలిగ్గా వదలరా?

వేసవి ఎండలకు మించిన తీవ్రత బందరు పాలిటిక్స్ లో కనిపిస్తోంది. రేషన్ అక్రమ బియ్యం తరలింపు కేసులో బెయిలు పొంది ఊపిరి పీల్చుకున్న మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని కుటుంబానికి ప్రభుత్వం మరోసారి షాకిచ్చింది. జిల్లా కోర్టులో బెయిలు పొందడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీలు చేయడం ద్వారా పేర్నికి ముప్పు పొంచి ఉందనే సంకేతాలు పంపుతోంది.

మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధకు చెందిన గోడౌన్ నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోయారని కొన్ని నెలల కిందట ప్రభుత్వం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో జయసుధ ఏ1 కాగా, పేర్ని ఏ6గా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరు తప్ప ఈ కేసులో మిగిలిన నిందితులు అరెస్టు అయి విడుదలయ్యారు. పేర్ని, ఆయన సతీమణికి ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో కారాగారవాసం తప్పిపోయింది. అయితే మాజీ మంత్రి పేర్ని విషయంలో రాజీలేదన్నట్లు వ్యవహరిస్తున్న మచిలీపట్నం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర పట్టుబట్టి పేర్నిపై కేసును హైకోర్టులో అప్పీల్ చేయాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

పేర్ని జయసుధ బెయిలుపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. పోలీసుల పిటిషనుపై బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. దీంతో మాజీ మంత్రి పేర్నికి మళ్లీ టెన్షన్ స్టార్ట్ అయింది. బియ్యం కేసు నమోదయ్యేంత వరకు పేర్ని నాని ప్రభుత్వంపై ఓ రేంజులో పోరాడేవారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై విమర్శల దాడి చేసేవారు. అయితే ఎప్పుడైతే బియ్యం కేసు నమోదైందో పేర్ని దూకుడుకి బ్రేకు పడింది. తన సహజ శైలికి భిన్నంగా పూర్తిగా సైలెంటు అయిపోయారని పేర్ని కోసం తెలిసిన వారు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పేర్ని భార్య జయసుధ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కోవడంతో పేర్ని కుటుంబం మరింత భయపడాల్సివచ్చిందంటున్నారు.

అయితే పేర్ని జయసుధ అరెస్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించకపోవడంతో ఆమెకు జిల్లా కోర్టులో బెయిల్ మంజూరైంది. ఈ విషయాన్ని పేర్ని స్వయంగా చెప్పారు. ఈ క్రమంలోనే పేర్ని కి కూడా ముందస్తు ఉపశమనం దక్కింది. అయితే బెయిల్ వచ్చిన తర్వాత పేర్ని మళ్లీ దూకుడు పెంచారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్టు తర్వాత పేర్ని స్పీడు పెంచారని అంటున్నారు. దీంతో ప్రభుత్వ వర్గాలు మళ్లీ పేర్నిపై ఫోకస్ చేశాయని చెబుతున్నారు. ఫలితంగా పేర్ని జయసుధ బెయిల్ రద్దు చేయాల్సిందిగా కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయాల్సిందిగా పోలీసులను ప్రభుత్వం పురమాయించిందని అంటున్నారు. మొత్తానికి ఈ కేసు మళ్లీ మొదటికి రావడంతో పేర్ని భవిష్యత్తుపై ఉత్కంఠ ఏర్పడుతోంది.

Tags:    

Similar News