వీళ్లంతా పొలిటికల్ 'పుష్ప.. టూ'లే... !
ఇప్పుడు రాజకీయాలకు వస్తే.. అనేక అంచానలతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు కూడా.. కొందరు పుష్ప-2 ల మాదిరిగానే రెచ్చిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
అల్లు అర్జున్ నటించిన సీక్వెల్ మూవీ పుష్ప-2 . తాజాగా థియేటర్లను కుదిపేస్తోంది. రెండు తెలుగురాష్ట్రా ల్లో వచ్చిన భూపంకాల కంటే.. ఇప్పుడు సినిమా హాళ్లలో పుష్ప-2 ప్రత్యేక భూకంపాలను సృష్టిస్తోంది. అనేక అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 అందుకు తగినట్టుగానే దూసుకుపోతోంది. ఇప్పుడు రాజకీయాలకు వస్తే.. అనేక అంచానలతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు కూడా.. కొందరు పుష్ప-2 ల మాదిరిగానే రెచ్చిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
వీళ్లంతా పుష్ప-2 అంటూ.. సోషల్ మీడియాలో టాక్ జోరుగా వినిపిస్తుండడం గమనార్హం. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విశాఖ పట్నం జిల్లాల్లో కూటమి పార్టీల ఎంపీల్లో కొందరు దూకుడుగా ఉన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల విరామం తర్వాత.. వారికి పదవులు దక్కడం.. వైసీపీ హయాంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నామనే ఫీలింగ్ ఉండడం, వ్యాపారాలు దెబ్బతిన్నాయన్న ఆవేదన కూడా వారిలో కనిపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారంతాపుష్ప-2 లెక్క రెచ్చిపోతున్నారని అంటున్నారు.
ఇదేసమయంలో కొందరు ఎమ్మెల్యేలు.. తమ కుటుంబాలకు పగ్గాలు అప్పగించారు. మరికొందరు సొంత గానే దూకుడు చూపిస్తున్నారు. ఇంకొన్ని నియోజకవర్గాల్లో తమను గెలిపించిన కూటమి నాయకులకు పగ్గాలు అప్పగించారట. ఇవన్నీ రోజూ వార్తల్లో వస్తున్నవే అయినా.. పుష్ప-2 సినిమా వచ్చాక.. వీరి పై మరింత చర్చ పెరిగింది. ఎమ్మెల్యేలు ఫ్యామిలీ డ్రామాను రక్తికట్టించడంతోపాటు వ్యాపారాలను పుంజుకునేలా చేసేందుకు అనుసరిస్తున్న వ్యూహాలు ఫక్తు ఈ సినిమా మాదిరే ఉన్నాయని చెబుతున్నారు.
మంత్రులను మచ్చిక చేసుకోవడం నుంచి స్థానికంగా ఉన్న అనేక అంశాలను ఎమ్మెల్యేలు డీల్ చేస్తున్న తీరు కూడా.. పుష్ప-2కు ఏమాత్రం తీసిపోవడం లేదని చెబుతున్నారు. ఇసుక, మద్యం అనేవి నిన్నటి సంగతులని.. ఇప్పుడు కొత్తగా రోడ్ల కాంట్రాక్టును దక్కించుకునేందుకు.. తమ్ముళ్ల మధ్య పోటీ మరింత పెరిగిందని అంటున్నారు. జిల్లాకో రకంగా.. నాయకులు వ్యవహరిస్తున్నారు. కొన్ని కొన్ని జిల్లాల్లో నేరుగా మంత్రులను ప్రభావితం చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం వీటిని ఎవరూ అడ్డుకోకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం జోరుగా చర్చ సాగుతోంది.