కొత్త స్పీకర్... బాబు మదిలో ఆ పేరు ?

ఇక 2019లో వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని సీతారాం తాజా ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు

Update: 2024-06-12 11:30 GMT

ఏపీకి కొత్త స్పీకర్ ఎవరు ఇపుడు అందరిలో అదే చర్చ సాగుతోంది. నిజానికి చూస్తే ఏపీకి స్పీకర్ గా ఉన్న వారికి రాజకీయంగా భవిష్యత్తు ఉండదని వారు అక్కడితో ఆగిపోతారని యాంటీ సెంటిమెంట్ ఉంది. అలా ఒక్క యనమల రామక్రిష్ణుడు తప్ప స్పీకర్ గా చేసిన వారు అంతా తెరమరుగు అయిపోయారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో స్పీకర్ గా చేసిన కోడెల శివప్రసాదరావు 2019 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత కొద్ది నెలలకే మరణించారు.

ఇక 2019లో వైసీపీ ప్రభుత్వంలో స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని సీతారాం తాజా ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. దీనిని బట్టి చూస్తే స్పీకర్ పదవికి ఎవరూ పోటీ కాకూడదు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వంలో మాత్రం స్పీకర్ పదవికి డిమాండ్ చాలానే ఉంది అని అంటున్నారు. సీనియర్లను ఎటూ మంత్రులుగా బాబు తీసుకోలేదు దాంతో వారంతా స్పీకర్ పదవి వైపు చూస్తున్నారు.

అత్యున్నతమైన ఈ రాజ్యాంగ బద్ధమైన పదవితో ప్రోటోకాల్ తో పాటు అన్నీ ఉంటాయి. బాగుంటుంది అని చాలా మంది ఆశిస్తున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి మొదలెడితే నెల్లూరు దాకా చాలా మంది పేర్లు స్పీకర్ పదవి విషయంలో వినిపిస్తున్నాయి. చంద్రబాబు 24 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో దాదాపుగా అన్ని సామాజిక వర్గాలు కవర్ అయ్యాయి. కాపులకు నాలుగు, రెడ్లకు మూడు, కమ్మలకు నాలుగు, ఎస్సీలకు రెండు, వైశ్య, ఎస్టీకి, మైనారిటీకి ఒకటి మంత్రి పదవులు లభించాయి. అలాగే బీసీలకు ఎనిమిది పదవులు ఇచ్చారు.

ఇక మంత్రివర్గంలో కవర్ కాని సామాజిక వర్గాలు చూస్తే బ్రాహ్మిన్స్ అలాగే క్షత్రియులుగానే చెప్పుకోవాలి. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి ఉన్నారు. క్షత్రియ కేటగిరిలో స్పీకర్ పదవి కోసం ట్రిపుల్ ఆర్ గా పేరు గడించిన రఘురామక్రిష్ణం రాజు ఉన్నారు. ఈ ఇద్దరిలో రఘురామను స్పీకర్ గా చేసి మాధవికి డిప్యూటీ పదవి ఇస్తారు అని ప్రచారం సాగుతోంది.

రఘురామ అయితే చంద్రబాబుని స్పీకర్ పదవి అడిగారు అని అంటున్నారు. అయితే స్పీకర్ పదవి చాలా కీలకమైనది. ఈ పదవిలో ఉన్న వారు బిజినెస్ రూల్స్ ని పూర్తిగా అవగాహన చేసుకోవడమే కాదు సభను సవ్యంగా నడిపించాలి. దాంతో అనుభవం కలిగిన వారు ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు.

అలా చూస్తే సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేరు వినిపిస్తోంది. ఆయనకు ఈ పదవి ఇవ్వడం గౌరవంగా ఉంటుంది అని అంటున్నారు ఆ తరువాత ఉత్తరాంధ్రాకు చెందిన కిమిడి కళా వెంకటరావు పేరు వినిపిస్తోంది. ఆయన సహయం, అనుభవం తో స్పీకర్ పదవిని వన్నె తెస్తారు అని అంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది.

ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలనుకుంటే కన్నా లక్ష్మీనారాయణ పేరు కూడా పరిశీలిస్తారు అని అంటున్నారు. ఎస్సీ సామాజిక వర్గం పరిగణనలోకి తీసుకుంటే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పేరు పరిశీలించవచ్చు అని అంటున్నారు. ఇలా చాలా పేర్లు ఉన్నా చంద్రబాబు మదిలో ఒక పేరు ఉందని ఆయనే కొత్త స్పీకర్ అని అంటున్నారు. ఆ పేరు బాబు సరైన సమయంలోనే రివీల్ చేస్తారు అని అంటున్నారు. సో అప్పటిదాకా వెయిట్ చేయడమే.

Tags:    

Similar News