హాట్ టాపిక్... జగన్ దగ్గరకు వెళ్లి పలకరించిన రఘురామ కృష్ణంరాజు!
అవును... మీరు చదివింది నిజమే! ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2019 ఎన్నికల తర్వాత అప్పటి నరసాపురం వైసీపీ ఎంపీ, ఇప్పటి ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఏ స్థాయిలో ఫేమస్ అయిపోయారనేది తెలిసిన విషయమే! అప్పుడు స్వపక్షంలో విపక్షం అన్నట్లుగా వైసీపీలో ట్రిపుల్ ఆర్ చేసిన విమర్శలు, సృష్టించిన అలజడులు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అయితే... తాజాగా జగన్ దగ్గరకు వెళ్లి కలిశారు రఘురామ.
అవును... మీరు చదివింది నిజమే! ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో "హత్యా రాజకీయాలు ఆపాలి.. సేవ్ డెమోక్రసీ" అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ నల్లకండువాలు ధరించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఏపీ అసెంబ్లీలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
ఇందులో భాగంగా... వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గరకు వెళ్లి పలకరించారు టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా కొన్ని నిమిషాలపాటు మాటామంతీ జరిగింది. ఇలా ఊహించని రీతిగా ఇరువురూ భేటీ అవ్వడం అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర పరిణామంగా మారిపోయింది.
కాగా... గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం జగన్ ప్రమేయంతోనే తనపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందంటూ టీడీపీ నేత, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆయన ఫిర్యాదులో జగన్ పై కేసు కూడా నమోదైంది! దీనికి సంబంధించి తన వద్ద ఉన్న సాక్ష్యాలను విచారణ అధికారికి అందజేస్తానంటూ రఘురామ ఇటీవల ప్రకటించారు.
అంతకంటే ముందు వైసీపీ రెబల్ ఎంపీగా మారిన రఘురామ... జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కొన్ని సందర్భాల్లో వాడు, వీడు అంటూ కూడా సంభోదించిన పరిస్థితి. అయితే.. తనకంటే చిన్నవాడైనప్పటికీ ఇకపై తాను జగన్ ని గౌరవంగానే సంభోదిస్తానంటూ రఘురామ ఇటీవల తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనతో ముచ్చటించారు.
ప్రస్తుతం ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఈ సమయంలో... వీరిద్దరూ ఏ విషయంపై మాట్లాడుకున్నారు, అసలు రఘురామ ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన రఘురామ... జగన్ ను పలకరించినట్లు చెప్పారు. సమావేశాలకు హాజరుకావాలని కోరినట్లు తెలిపారు. అసెంబ్లీలో జగన్ పక్కనే తనకు సీటు కేటాయించాలని కోరతానని అన్నారు!