ఎన్నికల వేళ రైలు టికెట్లకూ డబ్బుల్లేవ్.. రాహుల్ సంచలన ప్రెస్ మీట్

ఖాతాలను స్తంభింపజేయడంతో ఎన్నికల వేళ డబ్బులేక ప్రచారం చేయలేకపోతున్నామని పేర్కొన్నారు.

Update: 2024-03-21 10:05 GMT
ఎన్నికల వేళ రైలు టికెట్లకూ డబ్బుల్లేవ్.. రాహుల్ సంచలన ప్రెస్ మీట్
  • whatsapp icon

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ రూ.8 వేల కోట్లు పోగేసుకుంది.. మాకు మాత్రం ఇప్పుడు ఎన్నికల వేళ రైలు టికెట్లకూ డబ్బులు లేవు అంటోంది కాంగ్రెస్ పార్టీ. పార్టీ ఖాతాలను స్తంభింపజేయడంతో అష్టకష్టాలు పడుతున్నామని వాపోయింది. ఇది కేవలం పార్టీని దెబ్బతీసే కుట్ర అని బీజేపీపై మండిపడింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అగ్ర నేతలు ముగ్గురూ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒకేసారి మీడియా ముందుకువచ్చారు. ఇటీవల కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్‌, ఎన్నికల బాండ్ల గురించి మాట్లాడారు.

ఇది మోదీ కుట్ర

ఖాతాలను స్తంభింపజేయడంతో ఎన్నికల వేళ డబ్బులేక ప్రచారం చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. తమ పార్టీని దెబ్బతీసేందుకు మోదీ తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు నేరానికి పాల్పడుతున్నారు. మా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు. లావాదేవీలు చేయలేకపోతున్నాం. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం. మా నాయకులను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం. విమానాలు కాదు.. రైలు టికెట్లు కొనడానికీ మా వద్ద డబ్బుల్లేవ్‌ అని రాహుల్ చెప్పుకొచ్చారు.

ప్రజాస్వామ్యాన్నే ఫ్రీజ్ చేశారు..

మోదీ ఫ్రీజ్ చేసింది కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను కాదని, భారత ప్రజాస్వామ్యాన్ని అని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని ఆరోపించారు. 20 శాతం ఓటర్లు తమకు మద్దతుగా ఉన్నారని.. కానీ తాము రెండు రూపాయలు కూడా చెల్లించలేకపోతున్నామని చెప్పారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదని విమర్శించారు.

మీ ఎన్నికల బాండ్ల సంగతేంది?

తమ పార్టీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బును బలవంతంగా లాక్కుంటున్నారని సోనియా ఆరోపించారు. కాంగ్రెస్‌ ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు మోదీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేకి వచ్చిన ఎన్నికల బాండ్లు.. ప్రధాన ప్రతిపక్షం ఆర్థిక లావాదేవీలపై దాడిని ప్రస్తావించారు. అభ్యర్థులకు ఇచ్చేందుకు డబ్బు లేదని.. ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే తమ బ్యాంకు ఖాతాలను అన్‌ ఫ్రీజ్‌ చేయాలని ఖర్గే కోరారు. సమయం చూసి కాంగ్రెస్‌ ను దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, ఎలక్టోరల్‌ బాండ్ల ప్రధాన లబ్ధిదారులు ఎవరో దేశానికి తెలుసని కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ ఆరోపించారు.

Tags:    

Similar News