గ్రహచారం బాగోకపోతే గోచీలో పిడుగు పడటం ఇదే!

ఈ ఘటనలో అతడు తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.

Update: 2024-06-27 06:30 GMT

గ్రహచారం బాగోకపోతే గోచీలో పిడుగు పడిందని సామెత. ఇలాంటి పరిస్థితే ఒక వ్యక్తికి ఎదురైంది. ఇటీవల కాలంలో రైళ్లు ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. పలువురు మృత్యువాత కూడా పడుతున్నారు. అయితే రైళ్లు ఢీకొనడం, పట్టాలు తప్పడం వంటివి ఏమీ జరగకుండానే ఒక వ్యక్తి రైలులోనే ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో అతడు తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు.

తన ప్రయాణం సౌకర్యవంతంగా సాగాలని ఒక వ్యక్తి రైలులో రిజర్వేషన్‌ చేసుకున్నాడు. దీంతో స్లీపర్‌ క్లాస్‌ లో బెర్త్‌ కూడా కన్ఫర్మ్‌ అయ్యింది. ఇంకేం హాయిగా ప్రయాణించవచ్చని అతడు అనుకున్నాడు. అయితే తాను ఒకటి అనుకుంటే దైవం ఒకటి అనుకున్నట్టు జరిగింది. పైనున్న బెర్త్‌ ఊడి లోయర్‌ బెర్త్‌ లో ఉన్న అతడి మీద పడటంతో ఆ వ్యక్తి మృత్యువాత పడ్డాడు.

ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. కేరళలోని పొన్నానికి చెందిన అలీఖాన్‌ (62) ఎర్నాకులం – హజ్రత్‌ నిజాముద్దీన్‌ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ లో జూన్‌ 16న ఢిల్లీకి బయలుదేరారు. ఆరోజు రాత్రి రైలు వరంగల్‌ సమీపంలో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో అలీఖాన్‌ తన లోయర్‌ స్లీపర్‌ బెర్త్‌ లో నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన పైన ఉన్న మరో వ్యక్తి బెర్త్‌ ఒక్కసారిగా ఊడిపోయి అలీఖాన్‌ పై పడింది. ఈ ఘటనలో అలీఖాన్‌ మెడలోని మూడు ఎముకలు విరిగిపోయాయి. అంతేకాకుండా ఆయన అపస్మార స్థితికి చేరుకున్నాడు.

రైల్వే అధికారులను ప్రయాణికులు అప్రమత్తం చేయడంతో వెంటనే వారు అలీఖాన్‌ ను వరంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ తీసుకెళ్లారు. అక్కడ ఆయన మెడ చుట్టూ వైద్యులు మూడు శస్త్రచికిత్సలు నిర్వహించారు. అయినా అతడి ప్రాణాలను కాపాడలేకపోయారు. దీంతో అతడి మృతదేహాన్ని కేరళలోని పొన్నానిలో ఉన్న ఆయన స్వగ్రామనికి పంపారు.

ఈ విషాద ఘటనపై భారతీయ రైల్వే ఇంకా స్పందించలేదు. బెర్త్‌ ఊడిపడటానికి గల కారణాలను కూడా వెల్లడించలేదు. అయితే పై బెర్త్‌ గొలుసును సరిగా అమర్చకపోవడంతోనే బెర్త్‌ ఊడి పడిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాదం గురించి అలీఖాన్‌ సోదరుడు వివరించారు. అలీఖాన్, ఆయన ఫ్రెండ్‌ రైలులో ఉన్నారని తెలిపాడు. జూన్‌ 16న వీరు రైలెక్కారని.. తన సోదరుడికి లోయర్‌ బెర్త్‌ లభించిందని వెల్లడించాడు. ఈ క్రమంలో రైలు వరంగల్‌ సమీపంలో ప్రయాణిస్తుండగా పై బెర్తు ఊడి.. లోయర్‌ బెర్తులో ఉన్న తన సోదరుడిపై పడిందని.. దీంతో ఆయన గాయపడి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడని వాపోయాడు.

తోటి ప్రయాణికులు వెంటనే టీటీఈకి సమాచారం అందించడంతో రైల్వే అధికారులు వరంగల్‌ స్టేషన్‌లోని స్థానిక ఆస్పత్రికి తరలించి అలీఖాన్‌ కు వైద్యసేవలు అందించారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు అలీఖాన్‌ ను హైదరాబాద్‌ లోని మరొక ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతనికి మూడు శస్త్రచికిత్సలు నిర్వహించినా ఫలితం దక్కలేదు. జూన్‌ 26న అలీఖాన్‌ కన్నుమూశాడు.

అలీఖాన్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బెర్త్‌ బాగానే ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు అలీఖాన్‌ ప్రయాణించిన హజ్రత్‌ నిజాముద్దీన్‌ లో తనిఖీ చేశారు. ప్రయాణికుల గొలుసును సరిగ్గా అమర్చకపోవడం వల్ల పై బెర్త్‌ సీటు పడిపోయిందని రైల్వే అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

Tags:    

Similar News