రాజ్యసభలో రేర్ సీన్: పగలబడి నవ్విన ఛైర్మన్

రాజకీయం అంటే విమర్శలు.. ప్రతివిమర్శలు. ఆరోపణలు.. ప్రత్యారోపణలు మాత్రమే కాదు. అంతకు మించిన అన్నట్లుగా ఉంటాయి.

Update: 2024-08-03 05:51 GMT

రాజకీయం అంటే విమర్శలు.. ప్రతివిమర్శలు. ఆరోపణలు.. ప్రత్యారోపణలు మాత్రమే కాదు. అంతకు మించిన అన్నట్లుగా ఉంటాయి. కానీ.. ఆ విషయాన్ని మర్చిపోయి చాలాకాలమే అయ్యింది. గతానికి భిన్నంగా రాజకీయం వ్యక్తిగత వైరంగా మారిపోయిన వేళ.. ఒకరి ముఖాలు ఒకరు చూసుకోని పరిస్థితి. ఇక.. అసెంబ్లీ.. పార్లమెంటు సమావేశాల వేళ వాతావరణం ఎంత వాడివేడిగా మారుతుందో తెలిసిందే. అందుకు భిన్నంగా సభలో ఒక సభ్యురాలి వ్యాఖ్యకు.. గంభీరంగా ఉండే సభాపతి స్థానంలో ఉన్న ప్రముఖులు పగలబడి నవ్విన వైనం ఆసక్తికరంగానే కాదు.. ఇలాంటి రేర్ సీన్లు చూసినోళ్లంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

పెద్దల సభగా పేర్కొనే రాజ్యసభలో సభా ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కు సమాజ్ వాదీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ కు మధ్య జరిగిన సరదా సంభాషణ సభలో నవ్వులు పూయించటమే కాదు.. రాజ్యసభ ఛైర్మన్ పగలబడి నవ్విన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సభలో మాట్లాడేందుకు నిలబడిన జయాబచ్చన్ తనను తాను పరిచయం చేసుకుంటూ.. ‘‘నేను జయా అమితాబ్ బచ్చన్’’ అన్నంతనే సభతో పాటు.. రాజ్యసభ ఛైర్మన్ సైతం పగలబడి నవ్వారు. మామూలుగా అయితే.. ఈ మాటకు అంతలా నవ్వాల్సిన అవసరం ఏముందన్న సందేహం రావొచ్చు. కానీ.. ఇదే వారం ఆరంభంలో జరిగిన ఘటన తెలిస్తేనే.. ఈ నవ్వుల్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.

సోమవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ ఛైర్ లో ఉన్నారు. జయా అమితాబ్ బచ్చన్ మాట్లాడాలని ఆహ్వానించారు. దీనికి జయాబచ్చన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జయా బచ్చన్ అంటే సరిపోతుందన్నారు. దీనికి ఆయన బదులిస్తూ.. ‘‘రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలానే ఉంది’’ అని పేర్కొనగా.. మహిళలకు స్వతహాగా గుర్తింపు లేదా? అంటూ ఒకలాంటి అసహనాన్ని వ్యక్తం చేశారు. కట్ చేస్తే.. శుక్రవారం సభలో మాట్లాడేందుకు సిద్ధమైన జయాబచ్చన్.. వ్యంగ్యంగా తన పూర్తి పేరు చదవటం.. ఆ విరుపును అర్థం చేసుకున్న సభా ఛైర్మన్.. సభ్యులంతా నవ్వేశారు. దీంతో.. సభ వాతావరణం పూర్తిగా మారిపోయింది.

ఆ తర్వాత మాట్లాడిన సందర్భంలో జయాబచ్చన్.. ‘‘మీరు ఇవాళ భోజనం చేసినట్లు లేరు. అందుకే జైరాం రమేశ్ పేరుు పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఆయన పేరు ప్రస్తావించకుంటే తిన్నది అరగదేమో’’ అంటూ ఛైర్మన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనికి బదులిచ్చిన ఆయన అంతే సరదాగా బదులిస్తూ.. ‘‘వాస్తవానికి బ్రేక్ సమయంలో లంచ్ చేయలేదు. తర్వాత జైరాంతో కలిసి భోజనం చేశాను’’ అంటూ చమత్కరించటంతోసభలో నవ్వులు విరిశాయి. మీకు.. అమితాబ్ కు పెద్ద అభిమానిని.. ఆ విషయం చెప్పేందుకు తొలిసారి అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు.

అందుకు స్పందించిన జయాబచ్చన్.. తొలిసారి ఏంటి? అంటూ ప్రశ్నించగా.. ‘‘మీలాంటి దంపతుల్ని ఇప్పటివరకు ఎప్పుడూ కలవలేదు’’ అని అన్నారు. అందుకు బదులిచ్చిన జయాబచ్చన్.. ‘‘అందుకే నా పేరు ఇలా అయ్యింది’’ అంటూ నవ్వుతూ బదులిచ్చి కూర్చున్నారు. మొత్తంగా జయా అమితాబ్ బచ్చన్ పుణ్యమా అని సభలో ఒక రేర్ సీన్ చోటు చేసుకుందని చెప్పాలి.

Full View
Tags:    

Similar News