సీరియస్ వార్నింగ్... విమానాలకు బెదిరింపులు పంపితే లైఫ్ పడిపోద్ది!

ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన మంత్రి రామ్మోహన్ నాయుడు... ఇప్పటివరకూ వచ్చిన బెదిరింపులు మొత్తం బూటకమే అని తేలిందని అన్నారు.

Update: 2024-10-21 12:53 GMT

గత కొన్ని రోజులుగా భారతదేశ విమానయాన సంస్థలకు చెందిన విమానాలకు వరుస బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. గత వారం రోజుల వ్యవధిలో 100కి పైగా బెదిరింపులు వచ్చాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని కేంద్రం చాలా సీరియస్ గా తీసుకొంది.

అవును... గత కొన్ని రోజులుగా విమానయాన సంస్థలను, విమాన ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న బెదిరింపుల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా బెదిరింపులకు పాల్పడేవారిని నో-ఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలను సవరిస్తున్నామని అన్నారు.

ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన మంత్రి రామ్మోహన్ నాయుడు... ఇప్పటివరకూ వచ్చిన బెదిరింపులు మొత్తం బూటకమే అని తేలిందని అన్నారు. అయితే.. ఇలా బెదిరింపు కాల్స్, బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులకు పాల్పడేవారికి జీవిత ఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తెచ్చేందుకు యత్నిస్తున్నామని సంచలన విషయాలు వెల్లడించారు.

వాస్తవానికి విమానంలో బోర్డింగ్ అయ్యాక బెదిరింపులకు పాల్పడేవారికి ఇటువంటి శిక్ష విధించేలా ఇప్పటికే చట్టంలో సెక్షన్లు ఉన్నాయని.. అయితే, ఇతర ప్రాంతాల్లో ఉంటూ బెదిరింపులకు పాల్పడేవారికి కూడా వీటిని వర్తింపచేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

కాగా... ఈ నెల 14 నుంచి ఇప్పటివరకూ పలు దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే విమానయాన సంస్థల సీఈవోలతో "బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ" (బీసీఏఎస్) భేటీ అయ్యింది. ఈ సందర్భంగా... ఇలాంటి అసౌకర్యాలను ఎదుర్కోవడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం (ఎస్.ఓ.పీ) ను అనుసరించాలని సీఈవోలను కోరినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో 1982 సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చట్టాన్ని సవరించే అంశంపై వివిధ శాఖలతో కూడా చర్చిస్తున్నట్లు విచరించారు. ఇదే సమయంలో ఇప్పటికే వచ్చిన బెదిరింపుల వ్యవహారాన్ని హోంశాఖ, ఇతర ఏజెన్సీలతో కలిసి వీటిపై దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

Tags:    

Similar News