‘ఫైటర్ జెట్ పైలట్’ రతన్ టాటా గురించి తెలుసా?
ఇందులో ఒకటి స్పీడ్ కార్లంటే ఎంతో ఇష్టం కాగా.. విమానాలు, హెలీకాప్టర్ లే కాదు ఫైటర్ జెట్ లు కూడా నడపడం ఆయనకు చాలా ఇష్టం.
వ్యాపారవేత్తగా, అపారమైన దాతృత్వ గుణం ఉన్న వ్యక్తిగా తెలిసిన రతన్ టాటాలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. కాకపోతే అవి ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు. ఇందులో ఒకటి స్పీడ్ కార్లంటే ఎంతో ఇష్టం కాగా.. విమానాలు, హెలీకాప్టర్ లే కాదు ఫైటర్ జెట్ లు కూడా నడపడం ఆయనకు చాలా ఇష్టం. ఈ మేరకు ఆయనకు జెట్ విమానాలు, హెలీకాప్టర్లు నడిపేందుకు లైసెన్స్ ఉంది.
అవును... రతన్ టాటా ఓ గొప్ప వ్యాపారవేత్తే కాదు.. విమానాలు నడిపే ఓ మంచి పైలట్ కూడా. ఈ విషయంలో ఆయన పేరిట అరుదైన రికార్డ్ కూడా ఉంది. ఇందులో భాగంగా... 69 ఏళ్ల వయసులో ఆయన ఫైటర్ జెట్ ను నడిపి సంచలనం సృష్టించారు. ఈ సమయంలో ఆయన్ను... అమెరికా ఆయుధ తయారీ సంస్థ స్వయంగా ఎఫ్-16 యుద్ధ విమానాన్ని నడపడానికి ఆహ్వానించింది.
అది 2007వ సంవత్సరం. ఫిబ్రవరి 7 - 11 తేదీల్లో బెంగళూరులో ఏరో ఇండియా షో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎయిర్ క్రాఫ్ట్ మేనిఫ్యాక్చరింగ్ కంపెనీ లాక్ హిడ్ మార్టిన్ కూడా తమ ఫైటర్ జెట్లను ప్రదర్శించింది. ఈ సమయంలో ఆ సంస్థకు చెందిన ఓ ఫైటర్ విమానంలో కోపైలట్ గా వ్యవహరించారు రతన్ టాటా.
ఆ సమయంలో సుమారు అరగంట పాటు సాగిన ఈ అడ్వెంచర్ లో సంస్థ పైలట్ విమానాన్ని కొద్ది సేపు నడిపి.. అనంతరం కంట్రోల్ ను రతన్ టాటాకు అప్పగించారు. ఈ సమయంలో పైలట్ సాయంతో రతన్ టాటా కొన్ని విన్యాసాలు కూడా చేశారు. ఆ తర్వాత రోజే బోయింగ్ ఎఫ్-18 సూపర్ హార్నెట్ విమానాన్ని కూడా నడిపారు.
ఇలా వైమానిక రంగంపై తనకున్న ఆసక్తి విమానాలు నడపడం వరకే పరిమితం చేయలేదు రతన్ టాటా. సుమారు 69 ఏళ్ల తర్వాత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను తిరిగి ఆయన హయాంలోనే మాతృ సంస్థకు చేర్చారు! ఆ సందర్భంగా స్పందించిన రతన్ టాటా... "ఎయిర్ ఇండియా ప్రయాణికులకు సాదర స్వాగం" అంటూ ప్రత్యేక ఆడియో మెసేజ్ ను విడుదల చేశారు.