ఇమ్రాన్ నుంచి ట్రూడో వరకు.. ‘ప్రధానులకు’ గడ్డు కాలం
అయితే, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రధానమంత్రులకు గడ్డు కాలం నడుస్తోందా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రజాస్వామ్య దేశాల్లో చాలావరకు ప్రధానమంత్రే సర్వోన్నతుడు. అమెరికా వంటి కొన్ని దేశాల్లో మాత్రమే అధ్యక్ష వ్యవస్థ ఉంది. భారత్, బ్రిటన్, కెనడా, పాకిస్థాన్ తదితర చోట్ల ప్రధానమంత్రే పవర్ ఫుల్. ఈ దేశాల్లో అధ్యక్షుడూ ఉంటారు.. కానీ, వారికంటే ప్రధాని వద్దనే అధికారాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రధానమంత్రులకు గడ్డు కాలం నడుస్తోందా? అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అతి పెద్ద దేశానికి..
జస్టిన్ ట్రూడో కెనడాకు 10 ఏళ్లుగా ప్రధానిగా ఉన్న నాయకుడు. అలాంటి ట్రూడో ఇప్పుడు అకస్మాత్తుగా తప్పుకొన్నారు. దేశంలో మండిపోతున్న ధరలు, వలసలు, ప్రభుత్వ నిర్ణయాలు బెడిసికొట్టడానికి తోడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో ట్రూడోకు కష్టాలు మొదలయ్యాయి. కాగా, ట్రూడో రెండేళ్ల నుంచి భారత్ పై కక్ష పెట్టుకున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల కిందట ఖలిస్థానీ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రభుత్వం ఆరోపించడం.. తదుపరి పరిణామాల్లో దౌత్య సంబంధాలూ ఎన్నడూ లేనంత స్థాయికి పడిపోయాయి. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఎదుర్కొనాల్సి ఉండగా.. ప్రజా వ్యతిరేకతను గమనించిన ట్రూడో తప్పుకొన్నారు.
రష్యాను సమర్థించి
సరిగ్గా మూడేళ్ల కిందట మొదలైన ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యాను సమర్థించారు పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్. ఆ దేశం నుంచి చమురు కొనుగోలుకూ సిద్ధమయ్యారు. ఇది అమెరికాకు కోపం తెప్పించింది. దీంతో పాకిస్థాన్ లో పవర్ ఫుల్ అయిన సైన్యాన్ని రెచ్చగొట్టి ఇమ్రాన్ పవర్ పోయేలా చేసింది. కాగా, ఇమ్రాన్ ప్రభుత్వ పతనం అనంతరం ఎన్నికలు జరగ్గా అందులో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యారు.
ప్రచండ అనుకుంటే పదవి పాయె
ప్రపంచంలోని ఏకైక హిందూ దేశం నేపాల్ రాజకీయాలు అనిశ్చితికి మారు పేరు. మావోయిస్టు పార్టీ జన జీవన స్రవంతిలో కలిశాక ఇవి మరింత బలహీనంగా మారాయి. కాగా, నేపాల్ ప్రధానిగా మొన్నటివరకు ఉన్న ప్రచండ (పుష్ప కమల్ దహల్) అనూహ్యంగా దిగిపోయారు. విశ్వాస పరీక్షలో ఓటమితో ఆయన తప్పుకోక తప్పలేదు. దీంతో కేపీ శర్మ ఓలి ఆ పదవిలోకి వచ్చారు.
హసీనాకూ తప్పలేదు
బంగ్లాదేశ్ లో 2009 నుంచి అధికారంలో ఉన్నారు అవామీ లీగ్ పార్టీ అధినేత షేక్ హసీనా. గత ఏడాది జనవరిలో మరోసారి గెలిచారు. కానీ, ఆగస్టులో పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ పొడిగింపుపై తలెత్తిన ఆందోళనలు చివరకు హసీనాపై తిరుగుబాటుగా మారాయి. ఆమె పదవి నుంచి దిగిపోయి హుటాహుటిన భారత్ కు వచ్చి ఉంటున్నారు.
మనోడూ దిగిపోయాడు
కొన్ని శతాబ్దాల పాటు భారత్ ను పాలించిన బ్రిటిషర్లను పాలించే అవకాశం దక్కింది రిషీ సునాక్ కు. 2022లో ఆయన బ్రిటన్ ప్రధాని అయ్యారు. అయితే, అంతకుముందు ప్రధానులు చేసిన పొరపాట్లతో పరిస్థితి చేజారింది. నవంబరులో జరిగిన ఎన్నికల్లో సునాక్ పార్టీ ఓడిపోయింది. సునాక్ మాత్రం ఎంపీగా గెలిచారు.
ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న నెతన్యాహూకు హమాస్ తో యుద్ధం రూపంలో పెద్ద గండం ఎదురవుతోంది.