మాజీ మంత్రి భార్య వీరంగం.. పాలేరు ఆత్మహత్యాయత్నం!
సొంతంగా రెడ్యానాయక్ పై ఎలాంటి వివాదాలు లేవు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి 1989 నుంచి 2004 వరకు అప్రతిహతంగా గెలుస్తూ వచ్చారు రెడ్యా.
తెలంగాణలో ఆయనో సీనియర్ నాయకుడు.. జనరల్ సీటు నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అరుదైన రికార్డు ఉన్నవారు.. ఆయనే కాదు ఆయన కుమార్తె కూడా రాజకీయాల్లో గెలిచిన చరిత్ర ఉన్నవారు.. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినా.. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ లోకి వెళ్లారు. ఆయనే మాజీ మంత్రి రెడ్యా నాయక్.
సొంతంగా రెడ్యానాయక్ పై ఎలాంటి వివాదాలు లేవు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి 1989 నుంచి 2004 వరకు అప్రతిహతంగా గెలుస్తూ వచ్చారు రెడ్యా. ఈ సమయంలో ఇది ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడం గమనార్హం. మరోవైపు 2009లో తొలిసారి ఓటమి పాలైన రెడ్యా.. 2014, 2018లో తిరిగి గెలుపొందారు. 2023లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. రెడ్యా నాయక్ కుమార్తె అయిన మాలోతు కవిత 2019లో మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2009లో ఇక్కడినుంచే ఆమె ఎమ్మెల్యేగా తొలిసారిగా గెలుపొందారు.
రాజకీయాలతో నిత్యం సంబంధం ఉండే రెడ్యానాయక్ కానీ, ఆయన కుమార్తె కవిత కానీ ఎప్పుడూ వివాదంలో కనిపించలేదు. అయితే, రెడ్యా నాయక్ భార్య ధరంసోత్ లక్ష్మి అనూహ్యంగా వార్తల్లో నిలిచారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామంలో వ్యవసాయ పనులు సరిగా చేయడం లేదంటూ పాలేరు పై లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. తీసుకున్న అప్పునకు వడ్డీ సరిగా చెల్లించడం లేదంటూ కూడా ఆగ్రహం చెందినట్లు సమాచారం. అతడిని చితకబాదినట్లుగా కూడా చెబుతున్నారు. దీంతో మనస్థాపం చెందిన పాలేరు ధరంసోత్ యాకు పురుగుమందు తాగాడట. అతడిని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.