బంగ్లాదేశ్ 'పాఠం'.. భారత్‌కు కూడా!!
దీనికి కారణం.. రిజర్వేషన్లను రాజకీయాలకు ముడిపెట్టి.. పెంచుకుంటూ పోవడమే.
భారత దేశానికి అత్యంత మిత్రపక్షంగా ఉన్న బంగ్లాదేశ్.. మన దేశ సరిహద్దులను పంచుకోవడమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా పంచుకుంటున్న విషయం తెలిసిందే. పేరుకు ముస్లిం కంట్రీ అయినా.. బౌద్ధానికి, జైన మతాలకే కాదు.. హిందూత్వకు గత మూడు దశాబ్దాల కాలంలో బంగ్లాదేశ్ ప్రాధాన్యం ఇస్తోంది. అంటే.. ఒకరకంగా.. భారత్‌కు పొరుగు దేశం మాత్రమే కాదు.. మిత్ర దేశం కూడా. అయితే.. గత నాలుగు మాసాలుగా ఇక్కడ జరుగుతున్న రిజర్వేషన్ రగడ.. నింగి నంటిన విషయం... పోలీసులకు-ఉద్యమకారులకు మధ్య పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే.
దీనికి కారణం.. రిజర్వేషన్లను రాజకీయాలకు ముడిపెట్టి.. పెంచుకుంటూ పోవడమే. తాజాగా బంగ్లాదేశ్ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇవ్వక ముందు వరకు కూడా.. దేశంలో రిజర్వేషన్లను గమనిస్తే.. రాజకీయ ప్రాపకం ఎంతుందో అందరికీ తెలు స్తుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు వేసిన.. రిజర్వేషన్ పాచికలు.. గత రెండు దశాబ్దాలుగా.. దేశాన్ని అట్టుడికిస్తు న్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్లుగా దేశంలో హింస చెలరేగింది. ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్లపై ఉద్యోగులే రంగంలో కి దిగి తెలిపిన నిరసన, ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. దీంతో ప్రధాని హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపి.. ఆందోళన కారులను అణచి వేసింది.
అయినా.. ఉద్యమ కారులు శాంతించలేదు. రిజర్వేషన్లను ఎత్తేయాలని.. ఉన్న తక్కువ ఉద్యోగాలను రాజకీయ ప్రాపకంతో కొంద రికే కేటాయిస్తే.. మా పరిస్థితి ఏంటని లక్షల మంది ఢాకా వీధుల్లో అర్ధనగ్న ప్రదర్శన చేసిన ఘట్టం జాతీయ స్థాయిలోకాదు.. అంతర్జాతీయ స్థాయిలో కూడా దుమారం రేపింది. కర్ఫ్యూ పెట్టినా.. కాల్పులు జరిపి.. 110 మందికిపైగా ఆందోళన కారులను కాల్చి చంపినా.. వారు వెనక్కి తగ్గలేదు. మొత్తానికి రిజర్వేషన్ల వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని.. సంచలన తీర్పు ఇచ్చింది. ఫలితంగా ఇప్పుడు బంగ్లాదేశ్ కొంత వరకు శాంతించినా.. ఈ పరిణామాలు.. భారత్‌కు కూడా పాఠం కానున్నాయి.
ఎలా?
భారత్‌లోనూ పలు రాష్ట్రాలు రాజకీయ ప్రాధాన్యతల నేపథ్యంలో విచ్చలవిడిగా రిజర్వేషన్లను ప్రకటిస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగార్థుల విషయంలో ఇది.. పెను వివాదంగా మారుతోంది. బిహార్, ఏపీ, యూపీ సహా.. అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ అంశం వివాదంగానే ఉంది. ఇటీవల ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌లో ఓ తెగకు రిజర్వేషన్ కల్పించి.. ఇచ్చిన ప్రమోషన్లు, ఉద్యోగాలను కూడా.. సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. వీటి ద్వారా మెజారిటీగా ఉన్న వారికి అన్యాయం జరుగుతుందని తేల్చి చెప్పింది. 50 శాతానికి మించి రిజర్వేషన్లను అమలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సో.. పొరుగున ఉన్న బంగ్లాదేశంలో జరిగిన విధ్వంసం.. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వంటివి గమనిస్తే.. భారత్‌కు కూడా ఇవి గుణపాఠాలే కావాలి!!
బంగ్లాదేశంలో రిజర్వేషన్ ఇలా..
+ ఓపెన్ కేటగిరీలో: 44%
+ సమరయోధుల కుటుంబాలకు: 30%
+ మహిళలకు: 10%
+ వెనుకబడిన జిల్లాలకు: 10%
+ మైనారిటీలు: 5%
+ దివ్యాంగులకు: 1%
సుప్రీం కోర్టు తీర్పు తర్వాత..
+ ఓపెన్ కేటగిరీలో: 93%
+ సమరయోధుల కుటుంబాలకు: 5%
+ దివ్యాంగులు, మైనారిటీలకు: 2%
+ వెనుకబడిన జిల్లాలకు: ఎత్తేసింది.