ఒక్క మూడు నెల‌లు మీరక్క‌డ ఉండండి: రేవంత్‌ బిగ్ ఆఫ‌ర్‌

బీఆర్ ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావు, బీజేపీ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్‌ల‌ను ఉద్దేశించి.. రేవంత్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Update: 2024-10-18 02:59 GMT

''మీరున‌న్ను విమ‌ర్శిస్తున్నారు. మంచిదే. ఇది మీకు ఒక మంచి అవ‌కాశంగా కూడా మారింది. అది కూడా ఓకే. అయితే.. మీరు ఏదైతే విమ‌ర్శ‌లు చేస్తున్నారో.. అక్క‌డ మీరు ఒక్క మూడు నెల‌లు ఉండండి. ఆ త‌ర్వాత కూడా ఇప్పుడు చెబుతున్న‌ట్టే మీరు చెబితే.. నా నిర్ణ‌యాన్ని మార్చుకుంటా'' అని రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆఫ‌ర్ ఇచ్చారు. మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌పై ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న ఘాటుగా స్పందించారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో మూడు మాసాలు ఉండాల‌ని.. అప్పుడు చెప్పాల‌న్నారు.

బీఆర్ ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావు, బీజేపీ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్‌ల‌ను ఉద్దేశించి.. రేవంత్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. నేరుగా వారి పేర్లు చెబుతూ.. ముగ్గురూ మూడు మాసాలు మూసీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఉండాల‌న్నారు. ఎక్క‌డ ఉంటారో చెబితే.. అక్క‌డ ఏర్పాట్లు కూడా చేయించేలా అధికారు ల‌ను ఆదేశిస్తాన‌న్నారు. అనంత‌రం.. మీరు మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న అవ‌స‌రం లేద‌ని చెబితే.. అప్పుడు ఆ ప్ర‌తిపాద‌న‌ను తానే వెన‌క్కి తీసుకుంటాన‌ని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు.

మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌పై ఎలాంటి అనుమానాలు.. ఎవ‌రికి ఉన్నా ప‌రిష్క‌రించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామ‌ని చెప్పారు. రాజ‌కీయాలు మానుకోవాల‌ని సీఎం రేవంత్ సూచించారు. స‌మ‌స్య‌ల‌పై సూచ‌న‌లు చేస్తే.. త‌ప్పకుండా వాటిని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తామ‌న్నారు. ఈ విష‌యంలో బీజేపీ, బీఆర్ ఎస్, ఎంఐఎం నేత‌లు స్పందించాల‌ని కోరారు. కానీ, ఒక మంచి ప‌నికి అడ్డు త‌గ‌ల వ‌ద్ద‌ని సూచించారు.

కేసీఆర్ - క‌స‌బ్‌

రేవంత్ రెడ్డి త‌న మాటల్లో క‌ర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాది క‌స‌బ్ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. కేటీఆర్ క‌స‌బ్ మాదిరి గా మార‌తానంటే త‌న‌కేమీ అభ్యంత‌రం లేద‌న్నారు. వికారాబాద్‌లో రాడార్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించింద‌ని, ఇది దేశ భ‌ద్ర‌త‌కు అత్యంత కీల‌క‌మ‌ని చెప్పారు. దీనిని కూడా రాజ‌కీయ కోణంలో చూసేవారికి దేశ భ‌క్తి ఉంటుందా? అని ప్ర‌శ్నించారు. వారు కూడా క‌స‌బ్ వంటివారేన‌ని అన్నారు. కేటీఆర్ కూడా క‌స‌బ్ మాదిరిగా మారుతానంటే త‌న‌కేమీ అభ్యంత‌రం లేద‌న్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News