వారానికి 2సార్లు ప్రజాదర్బార్.. రేవంత్ కీలక నిర్ణయం

మొన్నటివరకు ప్రజాదర్బార్ గా పిలిచిన పేరును.. ప్రజావాణిగా మారుస్తూ.. ఇకపై ఈ కార్యక్రమాన్ని ఇదే తీరుతో పిలవాలని నిర్ణయించారు.

Update: 2023-12-12 05:21 GMT

ఒకటి తర్వాత మరొకటి చొప్పున వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్.. తాజాగా మరోసారి అదే తీరును ప్రదర్శించారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతి రోజే ప్రగతిభవన్ (ప్రజాభవన్)లో నిర్వహించిన ప్రజాదర్బార్ కు అనూహ్య స్పందన రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి రెండు కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు. మొన్నటివరకు ప్రజాదర్బార్ గా పిలిచిన పేరును.. ప్రజావాణిగా మారుస్తూ.. ఇకపై ఈ కార్యక్రమాన్ని ఇదే తీరుతో పిలవాలని నిర్ణయించారు.

హైదరాబాద్ లోని జ్యోతిబాపూలె ప్రజాభవన్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమంలో మార్పులు చేసినట్లుగా పేర్కొన్నారు. మొదట్లో చెప్పినట్లుగా ప్రతి శుక్రవారం మాత్రమే కాకుండా.. వారంలో రెండు రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఈ రోజు (మంగళవారం, డిసెంబరు 12) నుంచి ప్రతి మంగళవారం.. శుక్రవారాల్లో ప్రజాభవన్ లో ప్రజావాణిని నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణిలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ సాగుతుందని స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల లోపు ప్రజాభవన్ కు చేరుకున్న వారికి ప్రాధాన్యమివ్వాలని.. దివ్యాంగులు.. మహిళలకు ప్రత్యేక క్యూలైనట్లు ఏర్పాటు చేయాలని.. ప్రజావాణికి వచ్చే వారికి తాగునీరు.. ఇతర మౌలికవసతులు కల్పించాలని ఆదేశించారు. అంతేకాదు.. భద్రతా సిబ్బంది సైతం ప్రజావాణికి వచ్చే ప్రజలకు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. గత శుక్రవారం మొదలైన ప్రజాదర్బార్ కార్యక్రమానికి సోమవారం నాటికి ప్రజల నుంచి 4471 వినతులు అందాయని.. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.

Tags:    

Similar News