రేవంత్ కు ల్యాండ్ క్రూజర్ల తలనొప్పి? ఇప్పుడేం చేస్తారు?
ఒక్కో వాహనానికి రూ.3కోట్లు ఖర్చు అవుతుందని.. వాటిని బుల్లెట్ ఫ్రూప్ చేయాలంటే అదనంగా ఖర్చు అవుతుందని పేర్కొన్నారు
తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంచలన విషయాన్ని వెల్లడించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త చర్చకు తెర తీశారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన పది రోజులకు తెలిసిందంటూ ఆయనో షాకింగ్ నిజాన్ని వెల్లడించటం తెలిసిందే. ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించిన హ్యాట్రిక్ సీఎంగా పదవీ బాధ్యతల్ని చేపట్టటం ఖాయమన్న ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా 22 ల్యాండ్ క్రూజర్లను కేసీఆర్ సర్కారు కొనుగోలు చేసి.. విజయవాడలో దాచినట్లుగా రేవంత్ పేర్కొన్నారు.
ఒక్కో వాహనానికి రూ.3కోట్లు ఖర్చు అవుతుందని.. వాటిని బుల్లెట్ ఫ్రూప్ చేయాలంటే అదనంగా ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. అంతా బాగుంది. మొత్తంగా కాస్త అటుఇటుగా రూ.70 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూజర్లను ఇప్పుడేం చేస్తారు? అన్నది ప్రశ్న. గత ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు చేసిన వాహనాలతో కొత్త తలనొప్పిగా మారిందని చెబుతున్నారు.
ఎందుకంటే.. తాను ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తాను అప్పటివరకు వాడిన వాహనాన్నే సీఎం రేవంత్ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అనవసరమైన ఖర్చు అక్కర్లేదంటూ.. కొత్త వాహనాల్ని కొనుగోలు చేసే ప్రయత్నాల్ని నిలిపేయటం తెలిసిందే. అంతేకాదు.. మొదట్లో ఉన్న కాన్వాయ్ సైజును సైతం తగ్గించుకొని 9 వాహనాలకే పరిమితం అయ్యారు. ఇలాంటివేళ.. కేసీఆర్ సర్కారు కొనుగోలు చేసిన 22 ల్యాండ్ కూజర్లను ఏం చేస్తారు? అన్నది ప్రశ్నగా మారింది. అల్రెడీ కొన్నారు కాబట్టి.. ఇప్పుడు వాడటం మొదలుపెడితే.. మొదట్నించి చెబుతున్న సింపుల్ సిటీగా భిన్నమైన తీరుతో ఉంటుందని అంటున్నారు.
అలా కాకుండా వాటిని వాడకుండా ఉంచటంలో అర్థం లేదంటున్నారు. ఇలాంటి వేళ.. రేవంత్ ఆలోచనలు తెలిసిన ఆయన సన్నిహితులు మాత్రం భిన్నమైన వాదనను వినిపిస్తున్నారు. రేవంత్ మొండి మనిషి అని.. తాను ఒకటి అనుకుంటే ఎంత కష్టమైనా దాన్నే ఫాలో అవుతారని చెబుతున్నారు. అయితేగియితే.. కొత్త కార్లను తన మంత్రి వర్గానికి ఇస్తారని.. లేదంటే.. ఎవరూ వాడొద్దని.. గత ప్రభుత్వ దుబారాకు నిలువెత్తు రూపంగా వాటిని చూపే కార్యక్రమాన్ని చేపట్టే వీలుందని చెబుతున్నారు. అయితే.. అంత ఖరీదైన కార్లను వాడకుండా ఉండటం రేవంత్ వరకు ఓకే అయినా.. మిగిలిన మంత్రులు కాసింత గుర్రు అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఏమైనా.. ఎన్నికలకు ముందే కేసీఆర్ సర్కారు కొని ఉంచిన ల్యాండ్ క్రూజర్లు ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని మాత్రం చెప్పక తప్పదు.