విజయవాడలో కేసీఆర్ ల్యాండ్ క్రూయిజర్లు... రేవంత్ సంచలన ఆరోపణలు!

ఈ సమయంలో తాజాగా సెక్రటేరియట్ లో ఎవరూ ఊహించని ఆరోపణలాంటిది చేశారు.

Update: 2023-12-27 11:56 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధాలు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా గత బీఆరెస్స్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ సమయంలో తాజాగా సెక్రటేరియట్ లో ఎవరూ ఊహించని ఆరోపణలాంటిది చేశారు. ఇప్పుడు అది వైరల్ ఇష్యూగా మారుతుంది.

అవును... కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సంబంధించిన ధరఖాస్తు ఫారంను విడుదల చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. రేపటి (డిసెంబర్ 28) నుంచి జనవరి 6 వరకు ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అనంతరం.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇందులో భాగంగా... కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి... మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామని బీఆరెస్స్ అధినేత కేసీఆర్ పగటి కలల కన్నారని చెప్పుకొచ్చారు. అందుకోసమే ప్రత్యేకంగా కాన్వాయ్ కూడా రెడీ చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా చెప్పిన లెక్కలు చర్చనీయాంశం అయ్యాయి.

మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామని పగటికలలు కన్న కేసీఆర్... ప్రత్యేకంగా కాన్వాయ్ కూడా రెడీ చేసుకున్నారని తెలిపారు. దానికోసం ప్రజా ధనంతో 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొన్నట్లు తనకు తెలిసిందని.. వాటిని విజయవాడలో దాచిపెట్టారని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో ఈ విషయం తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన 10 రోజుల తర్వాత తనకు చిన్న అధికారి ద్వారా తెలిసిందని చెప్పిన రేవంత్... ఆ కార్లను ఒక్కోటి రూ.3 కోట్ల చొప్పున కొనుగోలు చేశారని అన్నారు! అలా కొన్న కార్లను తమ పరివారానికి ఇచ్చేందుకు సిద్ధం చేశారని.. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారని రేవంత్ తెలిపారు.

Full View
Tags:    

Similar News