రేవంత్ గేర్ మార్చాల్సిన టైం వచ్చింది.. లేకుంటే భారీ డ్యామేజ్
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ మొదటి రెండు నెలలు మెరుపులే తప్పించి మరకలు కనిపించవు.
ఏమీ లేని చోట ఆముదం చెట్టు మహా వృక్షంగా కనిపిస్తుందన్న సామెతకు తగ్గట్లు.. ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అయితే ప్రగతిభవన్.. లేదంటే ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమయ్యే గులాబీ బాస్ కేసీఆర్ ను పదేళ్ల పాటు చూసిన తర్వాత తెలంగాణ ప్రజలకు బోర్ కొట్టకుండా ఎందుకు ఉంటుంది? కష్టం వచ్చినా.. నష్టం కలిగినా.. పట్టని పాలకుడి పట్ల ప్రజలకు.. అందునా చైతన్యం నిండుగా ఉండే తెలంగాణ ప్రజలు తిరస్కరించటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కేసీఆర్ తప్పుల్ని బాగా స్టడీ చేసి.. ఆయనపై యుద్దం చేసిన రేవంత్ రెడ్డి లాంటి వారికి ఏం చేయాలన్న దాని కంటే ఏం చేయకూడదన్న విషయంపై క్లారిటీ ఉంటుంది.
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ మొదటి రెండు నెలలు మెరుపులే తప్పించి మరకలు కనిపించవు. పాలనలో కాస్తంత కుదురుకుంటున్నారన్న వేళలోనే సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేయటం.. ఫోకస్ మొత్తం ఎన్నికల మీదనే ఉంచాల్సి వచ్చింది. ఎన్నికల తర్వాత బండి గాడిన పడలేదు. అదే సమయంలో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరటం.. ఎన్నికల ఫలితాలు సంచలనంగా మారటం తెలిసిందే.
దీంతో.. ఇప్పుడు తెలుగు ప్రజల చూపు మొత్తం ఆంధ్రప్రదేశ్ మీదనే. గడిచిన ఐదేళ్లలో ఏపీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రానున్నాయి? అమరావతి సంగతేంటి? జగన్ అండ్ కో ఎలాంటి పరిణామాల్ని ఫేస్ చేయనున్నారు? లాంటి ఎన్నో ఆసక్తికర అంశాలు చర్చకు వస్తున్న పరిస్థితి. దీనికి తోడు పాలనలో మాంచి అనుభవం ఉన్న చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పాలనారథం ఎంత వేగంగా పరుగులు తీస్తుందన్న విషయం.. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటానికి ముందే పరిస్థితుల్ని సెట్ చేసిన వైనం పలువురిని ఆకట్టుకున్న పరిస్థితి.
అదే సమయంలో చంద్రబాబు స్పీడ్ ను.. రేవంత్ పాలన వేగంతో పోల్చి చూసే పరిస్థితి. నిజానికి చంద్రబాబుకు.. రేవంత్ కు పోలిక లేదన్నది నిజమే అయినప్పటికీ.. ఈ గురు శిష్యుల మధ్య పని తీరు పోలిక సామాన్య ప్రజలు చేస్తుంటారు. ఇలాంటప్పుడు రేవంత్ మీద ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఎన్నో పరిమితుల మధ్య పని చేయాల్సిన రేవంత్ కు అడుగు తీసి అడుగు వేయటం.. అధికారుల ఎంపిక మొదలు టీంను సెట్ చేసుకునే విషయం వరకు ఆయనకున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. వీటిని ఒక కొలిక్కి తెచ్చి.. పాలనలో స్పీడ్ చూపించాల్సిన అవసరం ఉంది.
ఇదంతా చెప్పినంత తేలిక కాదు. అందుకే.. పాలనకు సంబంధించి రేవంత్ ఇప్పుడు గేర్ మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అమరావతి.. దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ జోరు పెరగమే కాదు.. అక్కడ ధరలు భారీగా పెరిగిపోతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆశించినంత మేర రియల్ రంగం లేదన్న మాట వినిపిస్తున్న వేళ.. సీఎం రేవంత్ ఆ అంశంపై మరింత ఫోకస్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చంద్రబాబు జోరుకు తేలిపోతున్న వ్యాఖ్యలు రేవంత్ పైన వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ.. పాలనాపరమైన అంశాలపై మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం తెలంగాణ సీఎంకు ఉంది.