పబ్‌లపై దాడులు.. నలగురికి డ్రగ్స్ పాజిటివ్

పట్టణాల నుంచి చివరకు ఈ సంస్కృతి గ్రామాల వరకూ చేరింది.

Update: 2024-09-07 07:44 GMT

రాష్ట్రాన్ని డ్రగ్స్ పట్టిపీడిస్తున్నాయి. పోలీసులు ఎంత కట్టడిచేస్తున్నా నిత్యం డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. నిత్యం ఎక్సైజ్ శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు దాడులు చేసి పట్టుకుంటున్నా డ్రగ్స్ ప్లెడ్లర్స్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. నిత్యం కోట్లాది రూపాయల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. పట్టణాల నుంచి చివరకు ఈ సంస్కృతి గ్రామాల వరకూ చేరింది. గ్రామాల్లోనూ డ్రగ్స్ సేవిస్తున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతోంది.

ఇక హైదరాబాద్ నగరంలో అయితే వీకెండ్ వచ్చిందంటే.. సెలవులు వచ్చాయంటే పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడి పోలీసులు డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు నిత్యం పబ్‌లపై, డ్రగ్స్ కేంద్రాలపై దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ దాడుల్లో కొంత మంది తప్పించుకుంటుండగా.. చాలా వరకు పట్టుబడుతున్నారు. ప్రతీ వీకెండ్‌లో పోలీసులు దాడులు నిర్వహిస్తున్నా.. పట్టుబడుతున్న వారిని అరెస్ట్ చేసి కౌన్సెలింగ్ ఇస్తున్నా.. వినియోగదారుల్లో మార్పు రావడం లేదు.

నిన్న రాత్రి సైతం నగరంలో డ్రగ్స్ పట్టుబడింది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నగరంలోని ఐదు పబ్‌లపై అర్ధరాత్రి దాడులు చేశారు. నలుగురు వ్యక్తులు రెండు చోట్ల డ్రగ్స్ సేవించినట్లు గుర్తించారు. వారిని పట్టుకొని పాజిటివ్ పరీక్ష నిర్వహించారు. టీజీఎన్ఏబీ అధికారులు, ఎక్సైజ్ పోలీసులు కలిసి ఉమ్మడిగా ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. జాయింట్ కమిషనర్ ఖురేషీ, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్, అనిల్ కుమార్ రెడ్డి నేతృత్వంలో దాడులు కొనసాగాయి.

పెద్ద ఎత్తున కొనసాగిన ఈ దాడుల్లో 33 మంది వ్యక్తులు డ్రగ్స్ సేవించినట్లుగా పోలీసులు అనుమానించారు. వారందరి నుంచి మూత్రం శాంపిల్స్ సేకరించారు. డ్రగ్ డిటెక్షన్ కిట్‌లను ఉపయోగించి పరీక్షించారు. 33 మందిలో నలుగురికి పాజిటివ్ వచ్చింది. అయితే.. ఒకే పబ్‌లోని వ్యక్తులకు కాకుండా.. మాదాపూర్‌లోని ఓ పబ్‌లో ఏడుగురిలో ఇద్దరికి, జూబ్లిహిల్స్‌లోని మరో పబ్‌లో 12 మందిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిలో హైదరాబాద్, శ్రీకాకుళం, వరంగల్ నగరాలకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు.

Tags:    

Similar News